27 June, 2026 | 8:33 PM

క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి

27-06-2026 07:17 PM

సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ 

జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అమెరికా సామ్రాజ్యవాదం సోషలిస్టు క్యూబా దేశం పై ఆంక్షలు విధించడాన్ని  వ్యతిరేకిస్తూ, క్యూబా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ శనివారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ... అమెరికన్ సామ్రాజ్యవాదం సోషలిస్టు క్యూబా దేశంపై వివిధ రకాలుగా ఆంక్షలు విధించి ఆర్థిక దిగ్బంధనం చేయడం మూలంగా క్యూబా దేశ ప్రజలు ఆర్థిక సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అక్కడ అనేక కంపెనీలు మూతపడి లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని, వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోయిందని, చివరికి ఆ దేశంలో కరెంటు కూడా వాడుకునే పరిస్థితి లేదని అన్నారు. ఇలాంటి ఒక దుర్భర పరిస్థితిని సృష్టించి అక్కడ ప్రజల్లో సోషలిస్టు క్యూబా ప్రభుత్వంపై అక్కడి ప్రజలతో తిరుగుబాటు చేయించి, తద్వారా క్యూబాను లొంగదీసుకుని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని తద్వారా అక్కడి సహజ వనరులను కొల్లగొట్టాలని దుర్బుద్ధితో యుద్దోన్మది  ట్రంపు ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడ్డారని అన్నారు.

అమెరికన్ సామ్రాజ్యవాదం విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేసి అక్కడి క్యూబా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కావలసిన తగు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేశారు. మొక్కవోని దీక్షతో అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సోషలిస్టు క్యూబా దేశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆకలితో అలమటిస్తూ చావనైనా చస్తాం కానీ అమెరికాకు లొంగిపోమనే నినాదంతో అత్యంత ధైర్యసహసాలతో పోరాడుతున్న క్యూబా ప్రజలకు సిఐటియు సంఘీభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. కార్మిక వర్గం చైతన్యంతో ఇలాంటి అంతర్జాతీయ సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొని ప్రపంచ శాంతి కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.