"రీ-లొకేషన్ వద్దు.. గ్రామానికే అభివృద్ధి చేయండి"
* ప్రజావాణిలో కలెక్టర్‌కు వటువర్లపల్లి గ్రామస్తుల వినతి
అచ్చంపేట: "మాకు రీ-లొకేషన్ వద్దు.. మా గ్రామానికే అభివృద్ధి చేయండి" అంటూ వటువర్లపల్లి గ్రామస్తులు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ గళాన్ని వినిపించారు. గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజావాణికి హాజరై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, తమ గ్రామం రీ-లొకేషన్ జాబితాలో లేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ గ్రామాన్ని విడిచి వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలకు బదులుగా రహదారులు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర మౌలిక వసతులు కల్పించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. గ్రామాన్ని తరలించడం కాకుండా, అక్కడే జీవించే అవకాశం కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి వడ్త్యావత్ బిచ్యాని, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.






