31 July, 2026 | 2:05 AM

రైతన్న మురిసేలా.. ముసురు కురిసెనిలా!

31-07-2026 12:18 AM

పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు

సింగూరుకు చేరుతున్న వరద నీరు

ఉమ్మడి మెదక్ జిల్లాలో జోరందుకున్న వరినాట్లు

సంగారెడ్డి, జూలై 30 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎండిపోతున్న పంటలకు పునర్జీవాన్ని ఇస్తూ, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తున్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వాతావరణం పూర్తిగా ముసురుగా మారడంతో పాటు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో అల్లాడిన రైతులకు ఈ వర్షాలు పెద్ద ఊరటనిచ్చాయి.

నీరు లేక ఎండిపోయే దశకు చేరిన మొక్కలకు, మక్కజొన్న పంటలకు ఈ వానలు మళ్లీ ప్రాణం పోశాయి. పొలాల్లో తేమ శాతం పెరగడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి నాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గమ్మ ఆలయం సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్ ఆనకట్ట) అలుగు పారుతూ పొంగిపొర్లుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయమైన సింగూరు ప్రాజెక్టులోకి ఈ సీజన్లోనే మొదటిసారిగా వరద నీరు వచ్చి చేరుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని వాగులు, చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 

పొంగుతున్న ధూప్సింగ్ తండా వాగు...

మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలంలోని దూప్సింగ్ తండా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు రోడ్డుపైకి చేరడంతో చుట్టుపక్కల గ్రామాలకు, గిరిజన తండాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు లోతట్టు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

గత రెండు రోజుల నుండి కురిసిన వర్షాలకు మెదక్ టౌన్లో4.8 సెంటీమీటర్లు, కుకునూర్ పల్లిలో 4.3 సెంటీమీటర్లు, జహీరాబాద్ లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రోజుల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఎవరూ ఉధృతంగా ప్రవహించే వాగులు, చెరువుల వద్దకు వెళ్లరాదని ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరించింది.