ఇంధన భద్రతకు తక్షణ చర్యలు
చమురు, సంక్షోభంపై కీలక చర్చలు
భారత్‌కు పరీక్షా సమయం
కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలి
రాష్ట్రాలకు సూచించిన ప్రధాని మోదీ
పెట్రోలియం, ముడి, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలపై సమీక్ష
న్యూఢిల్లీ, మార్చి 22: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి నిత్యావసర వనరుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇంధన భద్రత, తగినంత లభ్యత కోసం తక్షణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గ్యాస్ కొరతను నివారించేందుకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోలియం, ముడి, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితిని మోదీ ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో మంత్రలతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్నాథ్‌సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వనరుల పంపిణీ వ్యవస్థలో ఎక్కడా అంతరాయం కలగకూడదని అధికారులను ఆదేశించారు. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల కొరత రాకుండా చూడటం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత.
వనరుల రవాణాకు సంబంధించి సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్వహించాలని ప్రధాని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తూ, వినియోగదారుల కు, పరిశ్రమలకు భారం కలగకుండా తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సంక్షోభ పరిస్థితులపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఇది మన దేశ సామర్థ్యానికి, సహనానికి ఒక కీలక పరీక్ష అని అభివర్ణించారు. పశ్చిమ ఆసియా సంఘర్షణ వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజాచైతన్యం, ప్రభుత్వ కృషీ తోడవాలని ఆయన ఆకాంక్షించారు.
సరఫరా గొలుసులో తలెత్తే అడ్డంకులను అధిగమించేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన హామీ ఇచ్చారు. వినియోగదారుల, పారిశ్రామిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని, ఇంధన భద్రతను కాపాడటానికి, తగినంత లభ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తక్షణ చర్యల్లో భాగంగా, ప్రభుత్వం విద్యాసంస్థలు, ఆసుపత్రుల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను పెంచిందన్నారు.
గృహ, వాణిజ్య వినియోగదారుల కోసం కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సులభతరం చేయాలని కూడా రాష్ట్రాలకు సూచించారు. ప్రస్తుత నిల్వల స్థాయిలు, దిగుమతులపై ఆధారపడటం, ఏవైనా అంతరాయాలను ఎదుర్కొనేందుకు ఉన్న ఆకస్మిక ప్రణాళికల గురించి కీలక మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు, భాగస్వాములు ప్రధానమంత్రికి వివరించారు. కొరతను నివారించడానికి, ధరలను నియంత్రించడానికి, పౌరులలో భయాందోళనలను నివారించడాని కి మంత్రిత్వ శాఖల మధ్య సన్నిహిత సమన్వయం అవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే పక్షంలో, ఆకస్మిక ప్రణాళికలను పటిష్టం చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
భారతదేశం తన ఇంధన అవసరాలలో గణనీయమైన భాగాన్ని గల్ఫ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నందున, అక్కడ ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, మరోపక్క హోర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని మోదీ దౌత్యపరమైన వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. సంఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, కువైట్, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలతో పాటు ఫ్రాన్స్, మలేషియా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల అధినేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రాంతీయ శాంతిని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ ఇంధన భద్రతను కాపాడాలని భారత్ కోరుతోంది.




