23 March, 2026 | 9:34 AM

మంగళూరుకు చేరిన రెండు నౌకలు

23-03-2026 12:00 AM

అమెరికాలోని టెక్సాస్ నుంచి పైక్సిస్ పయనీర్ ద్వారా 72,700 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్

రష్యా నుంచి ఆక్వా టైటాన్’ షిప్ ద్వారా 96,000 మెట్రిక్ టన్నుల ముడిచమురు

ఈ పోర్టుకు త్వరలో రానున్న మరో 2 నౌకలు!

భారత్‌లో తీరనున్న గ్యాస్ కష్టాలు

బెంగళూరు, మార్చి 22: ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. ఈ పరిణామాల మధ్య ఎల్పీజీ వంటగ్యాస్ తో కూడిన రెండు భారీ కార్గో నౌకలు శనివారం రాత్రి ఒకటి, ఆదివారం మరొకటి కర్ణాటకలోని మంగళూరుకు చేరాయి.

ఇక్కడికి వచ్చిన చమురు ట్యాంక్‌ల్లో అమెరికాలోని టెక్సాస్ నుంచి పైక్సిస్ పయనీర్, మరోటి రష్యా నుంచి ఆక్వా టైటాన్ ట్యాంకర్. ఆక్వా టైటాన్ షిప్ ద్వారా 96,000 మెట్రిక్ టన్నుల ముడిచమురు, పైక్సిస్ పయనీర్ నౌక ద్వారా మొత్తం 72,700 టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ)ను తీసుకొచ్చాయి.ఒకటి ఫిబ్రవరి 14న అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన పైక్సిస్ పయనీర్ నౌకకు 13వ బెర్త్‌లో లంగర్ వేసినట్లు న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ డైలీ వెస్సెల్ పొజిషన్ తెలిపింది.

సింగపూర్ జెండాతో ఈ అమెరికా ట్యాంకర్ వచ్చింది. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారిగా, రష్యా నుంచి ‘ఉరల్స్’ ముడి చమురును తీసుకొస్తున్న ఒక నౌక న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. అక్వా టైటాన్ అనే పేరు గల ఈ సరుకు రవాణా నౌక, వాస్తవానికి రష్యాలోని ప్రిమోరస్క్ నుంచి చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అయితే, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా, ఇది తన మార్గాన్ని మంగళూరు వైపు మళ్లించుకుంది. ఇది శనివారం రాత్రి, మార్చి 21న, న్యూ మంగళూరు పోర్టు బాహ్య సముద్రంలో ఉన్న తేలియాడే జెట్టీని చేరుకుంది.

ఈ తేలియాడే జెట్టీ, భారీ నౌకల నుంచి ముడి చమురును దించుకోవడానికి అవసరమైన సదుపాయాలతో కూడి ఉంది. ఈ నౌక ఇక్కడ రష్యన్ ఉరల్స్ ముడి చమురును దించుతుంది. దీనిని ఎంఆర్‌పీఎల్ శుద్ధి చేస్తుందని భావిస్తున్నారు. ఈ నౌక 96,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తున్నట్లు సమాచారం. కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నడుమ, ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీతోపాటు ముడి చమురు సరఫరా పరిస్థితి సున్నితంగానే కొనసాగుతోంది. ఈ నౌక రాకతో సరఫరా డిమాండ్‌లో కొంత మెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు.

రానున్న మరిన్ని ట్యాంకర్లు

ఈ నెల చివరి నాటికి న్యూ మంగళూరు పోర్టుకు మరో రెండు నుంచి మూడు చమురు ట్యాంకర్లు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు నుంచి 1.36 లక్షల టన్నులు, 2.6 లక్షల టన్నుల ముడి చమురును మోసుకొస్తున్న రెండు నౌకలు ఇప్పటికే మంగళూరు మార్గంలో ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఎంఆర్‌పీఎల్ సంవత్సరానికి 18.2 మిలియన్ టన్నుల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి నెలకు సుమారు 1.5 లక్షల టన్నుల ముడి చమురు అవసరమవుతుంది. మార్చి నెలలో ఇప్పటివరకు, ఎన్‌ఎంపీఏ సింగిల్ పాయింట్ మూరింగ్ వద్ద రెండు ముడి చమురు ట్యాంకర్లను, ప్రధాన పోర్టు వద్ద మూడు ట్యాంకర్లను నిర్వహించింది.

పోర్టులో ఛార్జీల మాఫీ

మార్చి 14 నుంచి 31 వరకు క్రూడ్ ఆయిల్, ఎల్‌పీజీ సరుకు రవాణాకు సంబంధించిన ఛార్జీలను న్యూ మంగళూరు పోర్టు మాఫీ చేసినట్లు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా మాట్లాడారు. దేశంలోని ఏ పోర్టులోనూ రద్దీ లేదని స్పష్టం చేశారు. సరుకు రవాణా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారత నౌకల భద్రతపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షణ కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. మొత్తం 22 భారతీయ నౌకల్లో ఉన్న 611 మంది నావికులు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు

భారత్‌లో తీరనున్న గ్యాస్ కష్టాలు

ఈ నెల 18న సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడిచమురుతో కూడిన జాగ్ లాడ్కీ అనే ట్యాంకర్ ముంద్రా పోర్ట్‌కు చేరుకుంది. దీంతో పాటు సుమారు 47,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చిన నందాదేవి కార్గో షిప్.. వడినార్ పోర్టుకు చేరింది. అలాగే శివాలిక్ కార్గో వెసెల్ కూడా ముంద్రాలో లంగర్ వేసింది. వీటి ద్వారా దాదాపుగా లక్ష మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్‌కు అందింది. దీనికి అదనంగా ఇప్పుడు తాజాగా పైక్సిస్ పయనీర్, ఆక్వా టైటాన్’ షిప్ మంగళూరుకు వచ్చాయి. పైక్సిస్ పయనీర్ ద్వారా, ఈ రెంప నౌకల ద్వారా కూడా మరో 1,,68,700 మెట్రిక్ టన్నుల చమురు వచ్చింది. ఈ నెలలోనే మరి కొన్ని చమురు ట్యాంక్‌లు కూడా రానున్నాయి. దీంతో భారత్‌లో నెలకొన్న గ్యాస్ డిమాండ్, కష్టాలు కొంత వరకు తీరనున్నాయి.