9 July, 2026 | 1:18 AM

మీసేవల్లోనూ యూరియా బుకింగ్

09-07-2026 12:07 AM

యాప్‌లో చేసుకోలేనివారికి సులువైన మార్గం

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకు న్నది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ యూరియా బుకింగ్ సేవ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసే వ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పనిచేస్తున్న మీసే వ, వ్యవసాయశాఖతో కలిసి ఈ కొత్త చొరవను ప్రారంభిస్తున్నది. 

ఈ సేవను పొందే విధానం..

- రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి.

- మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదుచేస్తారు.

- రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు.

- రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ధృవీకరించిన తర్వాత వెం టనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.

ముఖ్యమైన సూచనలు..

- మీ సేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడీ బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

- బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి.

- సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది.

- ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్ బుక్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి.

- కేవలం రూ.10ల నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

- ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం ఏఈవో, ఎంఏవో లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.