28 February, 2026 | 7:59 AM

అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

28-02-2026 02:22 AM

వేసవిలో దాహార్తి సమస్య తలెత్తకూడదు 

అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష 

నిజామాబాద్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీ.సీ హాల్ లో శుక్రవారం వారు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై, నగర ప్రగతిపై సమీక్ష జరిపారు.

ఆయా శాఖల వారీగా మంజూరైన పనుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి, ఏ మేరకు నిధులు ఖర్చు చేశారు, ఎక్కడెక్కడ సదుపాయాల పునరుద్ధరణ జరిగింది తదితర వివరాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు డివిజన్లలో సీ.సీ, బీ.టీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు, రోడ్ల నిర్మాణాలు పెండింగ్ లో ఉండగా, వాటిని వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు.

ముఖ్యంగా రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా దాహార్తి సమస్య నెలకొనకుండా ప్రణాలికాబద్దంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమృత్ పథకం కింద కొత్తగా 18 మంచి నీటి ట్యాంకులకు గాను 14 ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని, మిగితా నాలుగు ట్యాంకుల పనులను కూడా త్వరగా జరిపించాలని అన్నారు. అదేవిధంగా మంచినీటి పైప్ లైన్ విస్తరణ, భూగర్భ డ్రైనేజీ పనులను కూడా వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు.

అవసరమైన అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మహా ప్రస్తానం ఆకృతిలో స్మశాన వాటికను నిర్మించాలని, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయాలను పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడుతూ, విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పీ.ఎంశ్రీ నిధులతో అర్బన్ ఏరియాలోని ఆరు పాఠశాలల్లో చేపట్టిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయించాలని అన్నారు.

పన్నులను నూటికి నూరు శాతం వసూలు చేస్తూ, ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్బన్ లో ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు వేగంగా ఇళ్ళ నిర్మాణాలు చేపట్టేలా అవసరమైన తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. కాగా, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.  సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.