6 May, 2026 | 2:40 AM

విజయస్సునామి!

06-05-2026 01:40 AM
  1. ద్రవిడ గడ్డపై సరికొత్త రాజకీయ ఆధ్యాయం 
  2. సినిమా రంగంలో దళపతి ఇక రాష్ట్రాధిపతి 
  3. డీఎంకే, అన్నాడీఎంకే ద్విఛత్రాధిపత్యం బద్దలు
  4. ద్రవిడ పార్టీల తాయిలాలు తీసుకున్నా, టీవీకేకే తమిళుల మద్దతు 
  5. విజయ్‌ని ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలితతో పోలుస్తున్న విశ్లేషకులు

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తమిళనాట ద్రవిడ పార్టీల కంచుకోటలు బద్దలయ్యాయి. దుర్భేద్యమైన డీఎంకే, అన్నాడీఎంకే ద్విఛత్రా ధిపత్యం పటాపంచలైంది. 60 ఏళ్ల రాజకీయ మోనోపలి హస్తగత సమాప్తమైంది. ఎవరూ ఊహించని రీతిలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) సునామీ సృష్టించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఔట్ అండ్ రైట్ ఆధిపత్యం సాధించింది. 234 అసెంబ్లీ స్థానాల్లో 108 స్థానాలను కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీ (118 సీట్ల)కి కాస్త తక్కువ దూరంలో ఉన్నటికీ, తిరుగులేని విజ యం సాధించింది. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు ఎన్ని తాయిలాలు ఇచ్చి ప్రలోభ పెట్టినా, ఓటర్లు అవి తీసుకుని మరీ టీవీకే అభ్యర్థులకే జైకొట్టారు. 

సినిమారంగంలో సూపర్ స్టార్ అయిన విజయ్‌ను దళపతిగా పిలుచుకుంటూనే, ఏ కంగా రాష్ట్రాధిపతి పీఠాన్ని కట్టబెట్టారు. ఎగ్జి ట్ పోల్స్‌లో కూడా ఒక్క ‘యాక్సిస్ మై ఇం డియా’ సంస్థ తప్ప మరే ఇతర సంస్థ కూడా ఈ ఫలితాలను ఊహించలేకపోయింది. ఈ సంస్థ టీవీకేకు 98-100 సీట్ల వరకు కైవ సం చేసుకుంటుందని అంచనా వేసింది. ఆ అంచనాలను అధిగమించి టీవీకే 108 స్థానాలను దక్కించుకోవడం విశేషం.

ద్రవిడ పార్టీలతో విసుగు..

ఆరు దశాబ్దాలుగా పాతుకుపోయిన డీ ఎంకే, ఏఐఏడీఎంకే రాజకీయాలకు విసిగిపోయారు. వారసత్వ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, అహంకార పూరిత భీషణ ప్రతిజ్ఞలు విని విని అలసిపోయారు. అందుకే కొత్త పార్టీకి మద్దతు పలికారు. ముఖ్యంగా జెన్ జడ్ అయితే.. వేరే మాటే లేదు. ప్రశ్నే లేదు. మనస్ఫూర్తిగా విజయ్‌కు అండగా నిలిచారు. విజయ్ మీడియాకు దూరంగా ఉం టూ సోషల్ మీడియా ద్వారా తన సందేశా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తద్వారా నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. తరతరాల చరిత్ర కలిగిన రెండు ప్రధాన పార్టీల కోటలను నేల మట్టం చేశారు.

ఒక ఎంజీఆర్.. ఒక ఎన్టీఆర్.. 

దక్షిణాదిన పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న వారి లో ఎంజీఆర్ ప్రథముడు. ఆ తర్వాత ఎన్టీఆర్. అలాగే, ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అనతికాలంలోనే అధికారాన్ని దక్కించుకున్న నాయకురాలిగా జయలలితకు పేరుంది. టీవీకే అధినేత విజయ్ ఇప్పుడా ముగ్గురి సరసన నిలిచే నేత అంటూ రాజకీయ విశ్లేషకులు కితాబునిస్తున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే డీఎంకేలో ఎంజీఆర్ డక్కామొక్కీలు తిన్నారు. నానా ఆగచాట్లు పడ్డారు.

ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత సొంత పార్టీ అన్నాడీఎంకే నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక డీఎంకే నుంచి అయితే పడరాన్ని పాట్లు పడ్డారు. కానీ, విజయ్ మాత్రం అలాంటి పరాభవాలు లే కుండానే సీఎం పీఠాన్ని అధిష్ఠంచబోతున్నా రు. ఎంజీఆర్ డీఎంకేలో దశాబ్దాల అనుభవంతో ఎదిగారు. ఎన్టీఆర్ తన సామాజిక వ ర్గ అండతో కాంగ్రెస్‌పై పోరాడారు. కానీ, వి జయ్ ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, వ్య వస్థల మద్దతు లేకుండానే విజయబావు టా ఎగురవేశారు. విజయ్‌ని అభిమానులు ‘ముతలమైచార్ (ముఖ్యమంత్రి) అని పిలుచు కుంటూ సంబురాలు జరుపుకొంటున్నారు.

ఎలాంటి గిమ్మిక్కులు, మేజిక్కులు లేవు..

టీవీకే అధినేత విజయ్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కాళ్లకు బలపం కట్టకుని తిరిగారు. ఆలయాలు, మసీదులు, దర్గాలు, చర్చీలను సందర్శించారు. మురికివాడలు, ధనిక నివాస సముదాయాలు అన్న తేడా లేకుండా అణువణువూ పర్యటించారు. దాదాపు రాష్ట్రంలోని ప్రతి జిల్లాను టచ్ చేశారు. విజయ్ తన ప్రచారంలో ఎలాంటి గిమ్మిక్కులు ప్రయోగించలేదు. ఎలాంటి మ్యాజిక్కులు ప్రదర్శించలేదు. హిందూత్వ ఎజెండాను వాడుకోలేదు.

ద్రవిడ సెంటిమెంట్‌ను పూయలేదు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. కేసులకు వెరవలేదు. నిజం చెప్పాలంటే.. పార్టీని సంస్థాగతంగానూ అంత బలంగా నిర్మించలేదు. అయినా తమిళులు విజయ్ వెంట నిలిచారంటే, అందుకు కారణం ఆయన నిజాయతీనే. కేవలం తన ప్రచారం, తన ఛరిష్మా, తన మేనిఫెస్టోతోనే ప్రజలను ఆకట్టుకున్నారు. ఆ ధైర్యంతోనే విజయ్ మొత్తం 234 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు.

అనధికార సమాచారం ప్రకారం.. అధికార డీఎంకే ఒక్కో ఓటరుకు రూ.3,000 చొప్పున, ఏఐఏడీఎంకే రూ.2,000 చొప్పున ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టాయి. ప్రతి ఇంటికీ ప్రెషర్ కుక్కర్ల వంటి గృహోపకరణాలు పంపిణీ చేశాయి. ఓటర్లు అవన్నీ తీసుకున్నారు. కానీ, ఓటు మాత్రమే టీవీకే వేశారు.

ఎన్నో సవాళ్లు..

అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 85 శాతం భారీ పోలింగ్ నమోదు కాగా, టీవీకే దాదాపు 35 శాతం ఓట్ల వా టాను దక్కించుకుంది. విజయ్ స్వయ ంగా పెరంబూర్ నియోజకవర్గం నుం చి, తూర్పు తిరుచిరాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఏదేమైనా తమిళుల తీర్పు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా, స్వచ్ఛమైన ఇమేజ్ ఉన్న ఔట్ సైడర్ నాయకులు వ్యవస్థలను ఎలా మార్చగలరో దేశానికి చాటిచెప్పింది.

విజయ్ ముందు న్న, ఎదు ర్కోవాల్సిన సవాళ్లు కూడా తక్కువేమీ కావు. మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు పది సీట్ల దూరంలో ఉన్న టీవీకే, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రాజకీయ అనుభవం లేకపోవడం, ప్రచారంలో తక్కువగా మా ట్లాడటం వంటి అంశాలపై విమర్శలు విజయ్‌పై ఉన్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక వాటన్నింటినీ ఆయన ఎలా అధిగమిస్తారన్నది, ఇప్పుడు ఆయన భుజాలపై ఉన్న లగేజ్.