వన్యప్రాణుల వేట ముఠా గుట్టురట్టు
ఆరుగురు నిందితుల అరెస్ట్
బంజారాహిల్స్, మే 5(విజయక్రాంతి): అటవీ చట్టాలను ఉల్లంఘించి వన్యప్రాణుల ను వేటాడుతున్న ముఠా గుట్టును కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. షాద్ నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో ఎయిర్ గాన్లతో వన్యప్రాణులను వేటాడుతున్న ముఠా సభ్యులను అటవీ శాఖ అధికారులతో కలిసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు వెల్లడించారు.
అడిషనల్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెం దిన మొహమ్మద్ ముజఫర్ హుస్సేన్ (42), మీర్ అహ్మద్ అమీర్ (27), అబ్దుల్లా బిన్ సహైన్ (27), సౌద్ బిన్ మొహమ్మద్ బలాబ్ (41), మసూద్ బిన్ మొహమ్మద్ (43)లు వన్యప్రాణులను వేటాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. జంతువుల స్థావరాలను గుర్తించేందుకు వారికి మక్తల్ కు చెందిన కె.శేఖర్ (38) సహకరించేవాడన్నారు.
దీంతో అటవీ శాఖ అధికారులను సమన్వయపరచుకొని నిందితులను సంయుక్తంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. వారి నుంచి నాలుగు ఎయిర్ ఋగన్లు, ఒక లైసెన్సుడ్ స్పోర్టింగ్ రైఫిల్,20 తూటాలు, ఒక స్కార్పి యో కారు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ముఠా గతేడాది కాలంగా అటవీ ప్రాంతాల్లోని జింకలు,నెమళ్లు,కుందేళ్లు,ఇతర పక్షులను వేటాడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను తదుపరి చర్యల నిమిత్తం హైదరాబాద్ ఈస్ట్ రేంజ్ ఫారెస్ట్ అధికారులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషనులో టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ ఆర్.వెంకటేశ్, ఎస్‌ఐ కె.వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.






