6 May, 2026 | 3:13 AM

అక్రమ మైనింగ్ మటాష్

06-05-2026 01:52 AM

పారిశ్రామిక నిట్లపై హైడ్రా ఉక్కుపాదం

  1. వాయు కాలుష్యం, నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులపై స్పందన
  2. మాజీమంత్రి హరీశ్, బీఆర్‌ఎస్ నేతల ఒత్తిడికి తలొగ్గిన సర్కార్
  3. ‘కోర్’ సిటీలో కట్టడాలు, స్టోన్ క్రషర్లు, ఆర్‌ఎంసీలు నేలమట్టం
  4. మంత్రి పొంగులేటి కంపెనీ సహా బడా సంస్థల ఆటకట్టు

సికింద్రాబాద్/ శంషాబాద్, మే ౫ (విజయక్రాంతి): కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (క్యూర్)లో భాగమైన హైదరాబాద్ శివారులో అక్రమ మైనింగ్, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పారిశ్రామిక నిట్లపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. శంషాబాద్, గండి పేట పరిసర ప్రాంతాల్లో మంగళవా రం తెల్లవారుజామున భారీ యంత్రాలతో కట్టడాలను నేలమట్టం చేసింది. వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కొత్వాల్‌గూడ, గోపన్నపల్లి సహా ఆరు ప్రాం తాల్లో అక్రమ కట్టడాలను పడగొట్టింది.

ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది స్టోన్ క్రషర్లు తొలిగిపోయాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 13 ఆర్‌ఎంసీ ప్లాంట్లు ఉండగా, వాటిలో హైడ్రా మూడింటిని పడగొట్టింది. మిగిలిన 10 ఆర్‌ఎంసీ ప్లాంట్లను కూడా వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్య లు చేపట్టింది.

కట్టడాలు, ఆర్‌ఎంసీ లు, స్టోన్ క్రషర్లకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతోపాటు వాయు కాలుష్యం, విద్యుత్ చౌర్యం వంటి ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా స్పందించి, రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలతో ఈ మెగా ఆపరేషన్ నిర్వహిం చింది. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖ ల సంయుక్త బృందాలు దాడుల్లో భాగస్వాములై అక్రమ మైనింగ్ మాఫియాకు గట్టి హెచ్చరిక పంపాయి.

విస్తుపోయే దందా..

హైడ్రా దాడుల్లో బడా సంస్థల విస్తుపోయే అక్రమ దందాలు బయటపడ్డాయి. గ్రేట్ ఇండియా మైనింగ్ (గౌలిదొడ్డి), పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీలక్ష్మీ కన్‌స్ట్రక్షన్ (వట్టినాగులపల్లి) వంటి సంస్థలు ఏళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్న ట్లు అధికారులు గుర్తించారు. వాటి పరిధిలో కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో అధికారులు గతంలోనే కనెక్షన్ కట్ చేశారు. అయినప్పటికీ దొంగచాటుగా భారీ డీజిల్ జనరేటర్లను ఉపయోగిస్తూ యం త్రాలను నడుపుతున్నట్లు నిర్ధారించారు.

నిబంధనల అతిక్రమణ ఏ స్థాయిలో ఉందంటే.. బీఎస్‌ఆర్, అల్ట్రాటెక్, ఏసీసీ వంటి పెద్ద కంపెనీల రెడీమిక్స్ ప్లాంట్లు కూడా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. నివాస ప్రాంతాల వద్దే నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు తనిఖీల్లో తేలిం ది. ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఓఆర్‌ఆర్ పరిధిలోని సహజసిద్ధమైన గుట్టలను సైతం పిండి చేస్తున్న సంస్థలపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఎస్వీకే, పథ్వీ, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీ వంటి నిట్ల పరికరాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

రాజకీయంగా చర్చ..

రాజకీయంగా కూడా ఈ కూల్చివేతలు తీవ్ర చర్చకు దారితీశాయి. శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ క్రషర్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని గతంలో మాజీ మంత్రి, బీజేపీ నేత హరీశ్‌రావు అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. బడాబాబుల అండదండలతో, బినామీ పేర్లతో సాగుతున్న ఈ అక్రమ నిట్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొత్వాల్‌గూడలో దాదాపు 16 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ నిట్లు నిబంధనలను తుంగలో తొక్కాయి.

ఏడెకరాల మేర కొండలను తవ్వేసి ప్రకతి విధ్వంసానికి పాల్పడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చివరకు మంత్రి పొంగులేటిని ఒప్పించి అక్రమ నిట్ల కూల్చివేతకు సిద్ధపడినట్లు రాజకీయవర్గాలు చెబు తున్నాయి. సొంత మంత్రికి చెందిన సంస్థపై చర్యలు తీసుకోవడం ద్వారా తాము అక్రమాలను సహించబోమనే సంకేతాలు ప్రభుత్వం ఇస్తున్నట్లు అభిప్రాయపడుతున్నాయి.

స్థానికుల హర్షం..

హైడ్రా ఆపరేషన్‌తో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిరంతరాయంగా వెలువడే దుమ్మూ ధూళి, పేలుళ్ల శబ్దాలతో తాము నరకం అనుభవించామని వట్టినాగులపల్లివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికీ ఇబ్బంది పడే తమకు హైడ్రా ఆపరేషన్ ఎంతో ఊరటనిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించినా, పర్యావరణానికి హాని కలిగించినా వదిలే ప్రసక్తి లేదని హైడ్రా అధికారులు హెచ్చరించారు. మున్ముందు ఈ తనిఖీలు, ఆపరేషన్లను మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.