6 May, 2026 | 3:13 AM

రైతు గోస పట్టదా?

06-05-2026 01:47 AM
  1. ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడవు 
  2. నెల గడిచినా పంటలు కొనరా? 
  3. ధాన్యం, మక్కలు కొనేదాకా ప్రభుత్వాన్ని వదలం 
  4. రైతులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది 
  5. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  6. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన

మహబూబాబాద్/జనగామ, మే 5 (విజయక్రాంతి): వ్యవసాయం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంట దిగుబడి, కొనుగోళ్లపై సరైన అవగాహన లేదని, రైతులకు, ప్రజలకు అండగా ఉంటూ వారి గొంతుకగా తాము నిలుస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. బుధవారం వరంగల్ నగరంలో నిర్వహించే రైతు సంగ్రామ సభలో పాల్గొనేందుకు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటీఆర్ చేరుకున్నారు.

ఈ సందర్భంగా జనగామ జిల్లా యశ్వంతపూర్ వద్ద ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, పరకాల నియోజకవర్గం ఊకల్‌లో, నర్సంపేట మార్కెట్‌లో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి రైతు గోస పట్టడంలేదని మండిపడ్డారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడవని హితవుపలికారు. పంట చేతికొచ్చి నెల దాటినా కొనుగోలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఏనాడూ రైతులు ఇబ్బంది పడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అన్ని ఇబ్బందులే తలెత్తుతున్నాయని ఆరోపించారు. రైతులు దిగులు పడవద్దని, అండగా తాముంటామని, రైతుల సమస్యలను ప్రభుత్వం మెడలు వంచి తీరుస్తామని భరోసా ఇచ్చారు. ధాన్యం, మక్కలు కొనేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. యశ్వంతపూర్‌లో మక్కజొన్న కొనుగోళ్లు నిలిచాయని, నెలరోజులుగా 17వేల క్వింటాళ్లు నిల్వ ఉన్నాయని తెలిపారు.

ఒక్క గింజ కూడా కొనలేదని, మక్కజొన్న కుప్పలు పెరుగుతున్నా అధికారుల పట్టింపు లేదని, సంచు లు లేక కొనుగోలు నిలిచిపోయాయని మహిళా రైతుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను కేటీఆర్‌కు వివరించారు.

‘మహిళా రైతు ఉపేంద్రమ్మ తనకు 6 ఎకరాలు ఉండగా మొత్తం మక్కజొన్న పండించానని, 20 రోజులుగా కేంద్రం వద్ద వేచి ఉన్నప్పటికీ కొనుగోలు జరగలేదని, మరో రైతు విజయలక్ష్మి 3 ఎకరాల్లో పండించిన పంటను 15 రోజులుగా తీసుకొచ్చి పెట్టినా ఒక్క గింజ కూడా కొనలేదని, నాగరాణి అనే రైతు 5 ఎకరాల్లో పండించిన మక్కజొన్న 20 రోజులుగా కొనుగోలు లేకపోవడంతో వాన పడితే పంట నష్టపోతుందనే భయంతో ఉన్నాం’ అని కేసీఆర్‌కు తెలిపారు.

రైతుల సమస్యలను విన్న కేటీఆర్ వెంటనే మార్క్ ఫెడ్ ఎండీతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటా..

ఆర్టీసీ సమ్మె సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్న డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్ మంగళవారం నర్సంపేట నియోజ కవర్గం ముత్తోజిపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున డ్రైవర్ శంకర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులకు తప్పకుండా మద్దతుగా నిలుస్తామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలోనే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిందని అన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మీరు దయచేసి ధైర్యం కోల్పోకుండా, అందరం కలిసికట్టుగా పోరాడుదామని, మీకు న్యాయం జరిగే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు మీ తరఫున తాము గొంతు విప్పుతూనే ఉంటాం.. మీతో కలిసి నడుస్తాం.

అయితే ఎవరూ శంకర్‌గౌడ్ లాగా ప్రాణత్యాగాలు చేయవద్దని, మీ కుటుంబాలకు దుఃఖం మిగల్చవద్దని మనవిచేశారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అందరం కలిసి వారి కుటుంబానికి, అలాగే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుద్దామన్నారు. కేటీఆర్ వెంట మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మలోతు కవిత ఉన్నారు.