31 March, 2026 | 3:19 AM

అభివృద్ధికి అందరూ సహకరించాలి

31-03-2026 12:00 AM

రూ.107.30 కోట్ల అంచనా బడ్జెట్కు ఆమోదం

ఆదాయ వనరుల పెంపుతో పట్టణాభివృద్ధి సాధ్యం        

మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి

సూర్యాపేట, మార్చి 30 (విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. నూతన పాలక మండలి ఏర్పడిన తరువాత తొలి సమావేశంగా 2025-26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ ,2026-27 ముసాయి దా బడ్జెట్ సమావేశాన్ని సోమవారం స్థానిక రవి మహాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన రూ.107.30 కోట్ల బడ్జెట్కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తదుపరి చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి మాట్లాడుతూ  మున్సిపాలిటీ ఆదాయ వనరులను విస్తరించడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమ వుతుందని అన్నారు.

ఇంటి పన్నుల ద్వారా రూ.1775 లక్షలు, స్టాంపు డ్యూటీ ద్వారా రూ.600 లక్షలు, నాన్-ట్యాక్స్ ఆదాయం (అద్దెలు) ద్వారా రూ.204.50 లక్షలు, పరిశుభ్రత విభాగం ద్వారా రూ.111.50 లక్షలు, పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా రూ.1568.50 లక్షలు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.330.50 లక్షలు ఆదాయం రానుందని వివరించారు.అదనంగా డిపాజిట్లు, రుణాల రూపంలో రూ.110 కోట్లు, నాన్-ప్లాన్ నిధులు రూ.620 లక్షలు, ప్లాన్ నిధులు రూ.5170 లక్షలు, ఇతర నిధులు రూ.240 లక్షలు కలిపి మొత్తం రూ.10730 లక్షల బడ్జెట్ రూపొందించామని తెలిపారు.

ఖర్చుల కేటాయింపులలో సిబ్బంది వేతనాలకు రూ.1420 లక్షలు,పారిశుద్ధ్య  నిర్వహణకు రూ.522 లక్షలు, విద్యుత్ చార్జీలకు రూ.344 లక్షలు, రుణాల చెల్లింపులకు రూ.406 లక్షలు, గ్రీన్ బడ్జెట్కు రూ.459 లక్షలు, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణకు రూ.445 లక్షలు, సాధారణ పరిపాలనకు రూ.219.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రణాళిక విభాగం ఖర్చు కు రూ 7.50 లక్షలు, ప్రజా సౌకర్యాల కోసం రూ.65.73 లక్షలు, అభివృద్ధి పనులకు రూ.445.80 లక్షలు, 1/3 బ్యాలెన్స్ బడ్జెట్గా రూ.255.77 లక్షలు కేటాయించడం జరిగిందని తెలిపారు.ఇక డిపాజిట్లు, రుణాలు చెల్లింపు లకు 110 లక్షలు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రానున్న నాన్-ప్లాన్ గ్రాంట్ కింద రూ.620 లక్షలు, ప్లాన్ గ్రాంట్ కింద రూ.2460 లక్షలు, ఇతర నిధుల కింద అభివృద్ధి పనులకు రూ.2950 లక్షలతో మొత్తంగా 10730 లక్షలు కేటాయించడం జరిగిందని ఆమె వివరించారు. అనంతరం జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎం.డి. షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ సి.హెచ్. హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.