31 March, 2026 | 1:48 AM

‘ఇందిరమ్మ’ బిల్లులు ఆపారు

31-03-2026 12:00 AM
  1. ఇంటి బిల్లుల కోసం లబ్ధిదారుల పడిగాపులు

కలెక్టర్ అనుమతి ఇచ్చినా అందని బిల్లులు

అనుమతులిచ్చినా లాభమేంటి..?

ఆందోళనలో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు

తాడ్వాయి, మార్చి 30 (విజయక్రాంతి): గ్రామాలలోని నిరుపేదలు సరైన నివాస గృహాలు లేక పూరి గుడిసెల్లో, ప్రమాద స్థితిలో ఉన్న పెంకుటిండ్లల్లో నివాసం ఉంటున్నారు. మరికొందరు అసలే నివాసపు ఇండ్లు లేక బయట రేకుల షెడ్లలో పూరిపాకల్లో నివాసం ఉంటున్నారు. ఇలాంటివారు సరైన నివాస గృహా వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేక పూరి గుడిసె ల్లోనే మగ్గుతున్నారు.గత ప్రభుత్వ హాయం లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చిన చాలామంది పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాలేదు.

దీంతో ఇండ్లు లేని నిరుపేదలంతా గుడిసెల్లోనే మగ్గుతున్నారు. . అలాంటి వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించి బృహత్తరమైన ప్రణాళికను రూపొందించింది. ప్రతి ఇల్లు లేని  పేదవాడికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకాన్ని రూపొందించింది. ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారుడికి రూ. 5 లక్షలు మంజూ రు చేసింది.

కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొందరికి అర్హులైన ఇల్లు మంజూరు కాలేదు. దీంతో ఈ విషయమై ప్రత్యేకంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇల్లు మంజూరు కానీ లబ్ధిదారులకు సైతం ఇండ్లు మంజూరు చేశారు. ఇల్లు నిర్మించుకోవాలని అనుమతులు ఇచ్చారు. కానీ జిల్లా లో అలాంటి కొందరికి మంజూరు పత్రాలు ఇచ్చిన బిల్లులు రావడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు ఆగిపోతున్నాయి.

దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళ నకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా తా డ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన బక్క బాల్ రాజవ్వ, నరసయ్య కు టుంబం ప్రమాద స్థితిలో ఉన్న  పెంకుటింటిలో నివాసముంటుంది. పెంకుటిల్లు ప్రమాదస్థితిలో ఉన్నందున కలెక్టర్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వెంటనే ఇందిరమ్మ ఇంటి నిర్మా ణం చేపట్టాలని ఆదేశించారు.

వెంటనే స్పం దించిన బాల్ రాజవ్వ కుటుంబం నివాసం ఉంటున్న పెంకుటిల్లును కూల్చివేశారు. అదే స్థానంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం స్లాబు లెవెల్ వరకు గోడల నిర్మాణం పూర్తయింది. 

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఖర్చు..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు బాల్ రాజవ్వ రూ.4 లక్షలు ఖర్చు చేశారు. స్లాబు లెవల్ వరకు గోడలు నిర్మించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు రాలేదు. దీంతో బిల్లు ల కోసం అధికారుల వద్దకు వెళ్తే మీకు ఇల్లు మంజూరి లేదని అందుకోసమే బిల్లులు రావడంలేద ని తెలుపుతున్నారన్నారు. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది. కలెక్టర్ అనుమతి ఇస్తేనే తాము ఇంటి నిర్మాణం చేపట్టామని ప్రస్తుతం మీకు బిల్లులు రావడం లేదని అధికారులు చెబితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి స్లాబు లెవెల్ వరకు గోడలు నిర్మించుకున్నామని వారు తెలిపారు.

రేకులషెడ్‌లో నివాసం.. 

ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని ఉన్న ఇంటిని కూలగొట్టి ప్రస్తుతం పక్కనే పెరటిలో రేకుల షెడ్డు వేసుకొని నివాసం ఉంటున్నారు. వర్షాకాలం దగ్గర పడుతుందని తమకు బిల్లులు రాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఎలా పూర్తి చేస్తామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అనుమతి ఇవ్వకుంటే తాము అదే పెంకుటింట్లో ఉండే వాళ్ళమని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇందిరమ్మ ఇం టి బిల్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

స్లాబ్ లెవల్ వరకు నిర్మించాం... బిల్లు రావడం లేదు.. 

అదే నందివాడ గ్రామంలో మరో బాధితురాలు పెద్దోళ్ల సుహాసిని ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో స్లాబ్ లెవెల్ వరకు గోడలు నిర్మించుకుంది. ఇప్పటివరకు ఇందిరమ్మ బిల్లులు రాలేదు. దీంతో సువాసిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందించారని అందులో స్పష్టంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు ఉందని తెలిపారు.

ప్రస్తుతం ఇంటి మంజూరు కి సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారు లు బిల్లులు ఆపుతున్నారని సువాసిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే ఇందిరమ్మ బిల్లు ఇప్పించాలని ఆమె కోరుతున్నారు.

బిల్లులు ఇప్పించాలి.. 

తాము అప్పులు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టామని తమకు బిల్లులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పగానే తాము ప్రమాద స్థితిలో ఉన్న ఇల్లును కూల్చుకుని అదే స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాం. ప్రస్తుతం పక్కనే పెరటిలో తాత్కాలిక రేకుల షెడ్డు వేసుకుని అందులో ఉంటున్నాం . వర్షాకాలం వస్తే మా పరిస్థితి ఏంటి ? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇంటి బిల్లులు ఇప్పించాలి సారూ...

 బక్క బాల్‌రాజవ్వ, బాధితురాలు, నందివాడ