28 May, 2026 | 3:14 AM

గ్రానైట్ అక్రమాలపై ఈడీ సోదాలు

28-05-2026 02:13 AM

కరీంనగర్, మే27(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో నకిలీ ఇన్వాయిస్లతో జరిగిన భారీ గ్రానైట్ అక్రమాలు, జీఎస్టీ ఎగవేతలకు సంబంధించి ఈడీ , డీజీజీఐ అధికారులు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేకుండా కేవలం కాగితాలకే పరిమితమైన జీరో బిజినెస్ సంస్థలతో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి సుమారు రూ. 100 కోట్ల వ్యాపారం జరిపినట్లు అధికారులు గుర్తించారు.

జీఎస్టీ ఎగవేత: 

ఈ నకిలీ మార్గాల ద్వారా రూ. 16.96 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగినట్లు డీజీజీఐ స్పష్టం చేసింది. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టిన ఈడీ అధికారులు కరీంనగర్లోని పలు గ్రానైట్ ఫ్యాక్టరీలు, ఏజెన్సీలలో ఏకకాలంలో దాడులు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు సంబంధించి ఒకరిని అధికారులు అరెస్టు చేశారు గత దశాబ్దంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో పాటు, మైనింగ్ శాఖ రూ. 129 కోట్ల బకాయిలను సైతం రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది.

రాష్ట్ర ఆవిర్భావం నుంచి జిల్లాలో జరిగిన మైనింగ్ అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.కరీంనగర్ నుండి విదేశాలకు జరిగిన గ్రానైట్ ఎగుమతులు, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు ( మరియు హవాలా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఇందులో భాగంగా ప్రముఖ గ్రానైట్ వ్యాపారులు, సంస్థలకు నోటీసులు జారీ చేయడం, తనిఖీలు చేపట్టడం జరుగుతోంది. డీజీజీఐ అధికారులు కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమలో రూ. 16.96 కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన ప్రధాన సూత్రధారిని అధికారులు అరెస్ట్ చేసి, హైదరాబాద్లోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. తాజా పరిణామాల నేపథ్యంలో గ్రానైట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.