దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- ఫాజుల్‌నగర్‌లో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
వేములవాడ, మే 27,(విజయక్రాంతి)వేములవాడ రూరల్ మండలం,ఫాజుల్నగర్ గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ.46 లక్షల నిధులతో నిర్మించనున్న పెద్దమ్మ తల్లి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని,ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని అన్నారు.
గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. వేములవాడ నియోజకవర్గంలో పలు దేవాలయాల నిర్మాణాలకు నిధులు మంజూరై పనులు ప్రారంభం కావడం హర్షణీయమన్నారు. దేవాలయ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు.






