అకాల వర్షం.. అన్నదాత ఆగం
- వడగండ్ల వానతో అన్నదాతలకు, తప్పని తిప్పలు
- కొనుగోలు కేంద్రాల్లో 45 రోజులుగా పడిగాపులు
- అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతలకు నష్టం
- కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లతో కప్పిన ధాన్యం కుప్పలు,
- గాలి దుమారంకు దుమ్మురేగిపోయినా టార్పాలిన్‌లు
- తడిసిన ధాన్యం దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
ఎల్లారెడ్డి, మే 18 (విజయ కాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తేచ్చిన రైతులకు ధాన్యం కొనుగోలులో అవస్థలు తప్పడం లేదు. అధికారులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు రైతన్నలు తమ గోడును వెల్లబోసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అకాల వడగండ్ల, వర్షాలు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. గతంలో జరిగిన ఇబ్బందులను ఈసారి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి ఆరబోసిన కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కాంట పెట్టకుండా రోజుల తరబడి రైతులు వేచి చూసేలా అధికారులు చేస్తున్నారు.
అధికారుల తప్పిదం రైతన్నల పాలిట శాపంగా మారింది. అకాల వడగళ్ల వర్షాలు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడం 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద కాపాలా కాసిన రైతులకు అవస్థలు, ఇబ్బందులు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్ల పరిధిలో నీ రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు.
రైతులు చేసిన పాపం ఏమిటి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కుప్పల కుప్పల ధాన్యమును, తీసుకొచ్చి ఆరబెట్టి సుమారు 45 రోజులు కావస్తున్నప్పటికీ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల్లో తరలించకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము ఏమి పాపం చేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారులకు విక్రయిస్తే నష్టపోతారు
ప్రభుత్వము ఒకవైపు దళారులకు దాన్యము విక్రయిస్తే నష్టపోతారని అధికారులు చెప్పడం తప్ప ప్రభుత్వానికి విక్రయించాలని కొనుగోలు కేంద్రాలను తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వహణ నిర్లక్ష్యం, అధికారుల ఆలసత్వం వల్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు చెప్పితే హామీలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. దీంతో అన్నదాతలు మాత్రం దిక్కుతోచని స్థితిలో సతమతమవు తున్నారు.
వడగళ్ల వానకు తడిసిన ధాన్యం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం సాయంత్రం ఈదురు గాలులకు, వడగండ్ల వానకు ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని పెట్టుకొని కాంటాల కోసం ఎదురుచూసిన రైతులకు అకాల వడగళ్ల వర్షం కురవడం తో దాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి, గండిమాసంపేట్, శివానగర్, మాచాపూర్, తో పాటు పలు గ్రామాలలో సోమవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వర్షానికి, భారీ ఈదురు గాలులకు ధాన్యం తడిసి ముద్దయింది.
దీంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. బలమైన ఈదురు గాలులకు రోడ్డుపై చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది.దాన్యం కుప్పల పై ఏర్పాటుచేసిన టార్ప లీన్ లు ఎగిరిపోయి, ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆగమయ్యారు. 45 రోజులుగా ఎండ పెట్టిన ధాన్యం కళ్ళముందే వడగళ్ళ వర్షం రూపంలో తడిసి ముద్దవ్వడంతో ఇన్నిరోజుల కష్టం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.






