నవోదయ ‘కేరాఫ్’ జేపీ తండా!
- ఐదు విడతల్లో ఆరుగురు విద్యార్థులు నవోదయకు ఎంపిక
- ప్రైవేటుకు దీటుగా రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల
- ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సరికొత్త రికార్డు
నంగునూరు, మే 18:ప్రైవేటు పాఠశాలలకు వెళ్తేనే నాణ్యమైన చదువు లభిస్తుందనే నేటి సమాజంలో, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు సైతం చరిత్ర సృష్టిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని జేపీ తండా ప్రాథమిక పాఠశాల ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఒకే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి కనివినీ ఎరుగని రీతిలో ఏకంగా ఐదు విడతల్లో ఆరుగురు విద్యార్థులు నవోదయ విద్యాలయానికి ఎంపికై,ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మారుమూల గ్రామం.. ప్రగతి పథం..
ఒకప్పుడు మండలంలో జేపీ తండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం (బద్దిపడగ మధిర గ్రామం).2018లో సుమారు 500 మంది జనాభా, 380 మంది ఓటర్లతో ఇది ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అనంతరం ’మన ఊరు - మన బడి’ పథకం కింద ఇక్కడ నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు.
ప్రస్తుతం ఈ పాఠశాలలో 43 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక వాలంటీర్ విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థులకు ప్రాథమిక దశలోనే గట్టి పునాది వేయాలనే సంకల్పంతో ఉపాధ్యాయులు 2016 నుంచే నవోదయ ఎంపిక కోసం ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఐదు విడతల్లో ఆరుగురు విద్యార్థులు ప్రతిష్టాత్మక నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యారు.దీనితో పాటు ఈ ఏడాది పొన్నాల, సిద్దిపేట, కొండపాక గురుకుల పాఠశాలలకు సైతం మరో ఐదుగురు విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.
35 ఏళ్ల మండల చరిత్రలో సరికొత్త రికార్డు
నంగునూరు మండలంలో 18 ప్రభుత్వ ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. గత 35 ఏళ్ల చరిత్రలో మండలంలోనే కాకుండా, ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఒకే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఇన్ని విడతలుగా నవోదయకు విద్యార్థులు ఎంపిక కావడం ఒక్క జేపీ తండా పాఠశాలకే సాధ్యమైంది. ఉపాధ్యాయులపై నమ్మకంతో గత ఆరేళ్లుగా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ఇక్కడే చదివిస్తుండటం విశేషం. పాఠశాలలకు 90 శాతానికి పైగా విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అభినందిస్తోంది.
ప్రత్యేక శిక్షణ తరగతులతోనే ఇది సాధ్యం..
నవోదయ ఎంపిక కోసం విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వారానికి ఒకసారి సాధారణ పరీక్ష, 15 రోజులకు ఒకసారి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ వారిని తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల పూర్తి సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతోంది. పాఠశాల కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ సీట్లు సాధించడమే మా లక్ష్యం.
- ఎన్. చంద్రం, ప్రధానోపాధ్యాయులు, జేపీ తండా






