పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని
సనత్‌నగర్,(విజయక్రాంతి): పరిపాలన చేతకాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బూతు మాటలు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ లోని బికె గూడ పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం, బిఆర్ఎస్ పార్టీ పతాకాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగురవేశారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. హామీల అమలు గురించి ప్రశ్నిస్తే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా అంటూ ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఈ విధమైన భాష మాట్లాడే ముఖ్యమంత్రి ని చూడలేదన్నారు.
ముఖ్యమంత్రి స్థానానికి ఎంతో గౌరవం ఉందని, దాని విలువను దిగజారుస్తున్నారని అన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. 10 సంవత్సరాల పాలనలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని వివరించారు. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని అంటున్న ముఖ్యమంత్రి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి అన్నారు.
అద్భుతమైన సెక్రెటరీయేట్, పక్కనే ఉన్న అమరవీరుల స్థూపం, 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ సెంటర్ లను తొలగిస్తారా అని ప్రశ్నించారు. లేకుంటే యాదాద్రి దేవస్థానం, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా రాష్ట్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును కూలుస్తారా అని ప్రశ్నించారు. చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయని స్పష్టం చేశారు. కాయకష్టం చేసి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని, కనీసం గోనె సంచులు కూడా అందించలేని స్థితిలో అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని అన్నారు. మీ పార్టీని ప్రజలు పండబెట్టి తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.






