3 August, 2026 | 2:57 AM

9 నుండి ఉజ్జయిని మహంకాళి జాతర బ్రహ్మోత్సవాలు

03-08-2026 12:30 AM

జాతర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

తూప్రాన్, ఆగస్టు 2 ః తూప్రాన్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర బ్రహ్మోత్సవాలను ఈ నెల 9, 10, 11 తేదీల్లో వైభవంగా నిర్వహించ నున్నట్లు మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన తూప్రాన్ వేద పండితులు ముహూర్తం ఖరారు చేశారు. ఆదివారం ఉదయం శ్రీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో జాతర సన్నాహక సమావేశంలో ఉత్సవాల నిర్వహణ పై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా తూప్రాన్ చైర్మన్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, స్వాగత తోరణాలు, చాటింపు దండోరా టమ్ టమ్ వేయించడం, ఆలయానికి రంగులు, అలంకరణ, పులు, పూజా సామాను తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

జాతర కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 9న ఆదివారం బండ్లుబోనాలు, ఆగస్టు 10న సోమవారం గావు రంగాలు, ఆగస్టు 11న మంగళవారం బౌరమ్మ పూజతో పాటు ఒగ్గుకథ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రజిని, వైస్ చైర్మన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి, కౌన్సిలర్లు రామునిగారి స్వప్న నాగరాజు గౌడ్, జ్యోత్స్న వేణు, దుర్గం నగేష్, చెలిమెల రాములు, బైరాం సత్యలింగం, జైపాల్ రాథోడ్ నాయక్, బొడ్డు రాధా శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, వివిధ కులసంఘాల ప్రతినిధులు, పనిబాటల వారు, తదితరులు పాల్గొన్నారు.