3 August, 2026 | 4:03 AM

పార్టీయే సుప్రీం!

03-08-2026 02:43 AM
  1. నేనే బాస్ అనే ఏకచఛత్రాధిపత్యానికి చెక్
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త క్రమశిక్షణ
  3. రెండోసారి అధికారం, మెజార్టీ ఎంపీ సీట్లు టార్గెట్ 
  4. ఇప్పటి నుంచే కార్యాచరణ 
  5. 40 వేల మంది సుశిక్షితులైన కార్యకర్తలు సిద్ధం
  6. బూత్ స్థాయి నుంచి సోషల్ మీడియా వరకు పునర్వ్యవస్థీకరణ 
  7. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ పార్టీ ముద్ర

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి) : కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ నే సుప్రీం అనే సందేశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే దిశగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దూకుడు పెంచా రు. సీఎం అయినా, టీపీసీసీ అధ్యక్షుడైనా, మరెవరైనా పార్టీ నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనే క్రమశిక్షణను అమలు చేయడంపై ఆమె దృష్టి సారించినట్లు పార్టీ వర్గా లు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే సంస్థాగత బలోపేతానికి శ్రీకారం చుట్టిన ఆమె, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మంది సుశిక్షిత కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేసే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచా రం.

వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని దేశ ప్రధానిగా చూడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం తెలిసిందే. అందుకే, ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, కేరళం, హిమాచల్‌ప్రదేశ్‌లో మరోమారు అధికారాన్ని నిలు పుకునేందుకు పక్కా కార్యాచరణతో ముందుకుపోతోంది. మరోమారు రాష్ర్టం లో అధికారాన్ని చేపడితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇప్పుడున్న ఎనిమిది సీట్లకు అదనంగా మరికొన్ని స్థానాలను గెలుచుకోవాలన్నది టార్గెట్. తద్వారా దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు.

ఏఐసీసీ ఆదేశాలు పక్కాగా అమలు

మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టక మునుపు వ్యక్తులే ప్రధానమనే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉండేవి. ఈ విషయాన్ని గమనించిన ఆమె పార్టీ పటిష్టతకు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతున్నారు.  ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డికి సహకరిస్తూనే, పార్టీ పరంగా ఏఐసీసీ ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తు న్నారు. అప్పటి వరకు పార్టీ జిల్లా, నియోజకవర్గ కార్యవర్గాలు మాత్రమే ఉండేవి. మెజార్టీ మండల కమిటీలు పని చేసేవి కావు. నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేల చెప్పుచేతుల్లోనే పార్టీ ఉండేది.

ఆమె వచ్చిన తర్వాత పార్టీకమిటీలపై దృష్టి సారించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు తప్ప మిగతా నియోజకవర్గాల్లో పార్టీలో సీనియార్టీ, పార్టీ కోసం పని చేసిన వారికే బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ రాష్ట్ర, జిల్లా నియోజకవర్గం, మండల కమిటీలతో పాటు పార్లమెంట్ ఇంచార్జిలు..

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) రాష్ట్ర కో ఆర్డినేటర్లు,  జిల్లా కోఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు (వీఎస్‌ఏ), బూత్ లెవల్ సూపర్‌వైజర్లు (బీఎల్‌ఎస్), టీపీసీసీ అనుబంధ సంఘాలు, స్థానిక కమిటీలతో కలిపి దాదాపు 40 వేల మంది కార్యకర్తలను సుశిక్షుతులైన సైన్యం గా రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సర్ కార్యక్రమం పార్టీ బలోపేతానికి వరంగా మారిందని పేర్కొంటున్నాయి.  సర్ విషయంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడంలో భాగంగా గ్రామ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల్లో పార్టీ సి ద్ధాంతాలను ప్రచారం కూడా చేస్తున్నారు. ఒకప్పుడేమో కానీ, ఇప్పుడు ఒక్క పిలుపు ఇస్తే వేలమంది కార్యకర్తలకు సమాచారం చేరవేసే వ్యవస్థ ఏర్పడిందని చెబుతున్నారు.

అంతేగాక ఒక సభ నిర్వహణకు ఈ కమిటీల్లో ఉండే సభ్యులే వేలల్లో చాలనే విధంగా ఉంటారని చెప్పారు. వందల వాట్సాప్ గ్రూ పులు, ఇన్స్ట్రా గ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఫోరం,  పార్టీ రాష్ట్ర జాతీయ సమాచారం చేరవేయ డం జరుగుతోంది. పార్టీకి ఒక న్యూస్ ఛా నల్. పత్రిక లేని లోటును సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె భర్తీ చేస్తున్నారని తెలిపా రు. అంతేగాక, పార్టీయే సుప్రీం అనటానికి ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ (కోఆర్డినేషన్ కమిటీ) సమావేశం ఒక నిదర్శనమని చెబుతున్నారు. 

ప్రభుత్వ కార్యక్రమాలపైనా పార్టీ మార్క్   

రాష్ర్టంలో ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలపైనా పార్టీ మార్క్ ఉండేలా మీనాక్షి నటరాజన్ జాగ్రత్త పడుతున్నారు. సమన్వ య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడం కూడా ఆమె వ్యూహరచనలో భాగమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.  ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రివర్గంలో చర్చించి కొత్త ప థకాలను ప్రకటించేవారు.

ఇకపై సమన్వయ కమిటీలో చర్చించి ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించాల్సి ఉంటుంది. నేరుగా ప్రభుత్వమే పథకాలను ప్రకటించడం వల్ల ప్రజల్లోకి వెళ్లడం లేదనే విమర్శ ఉందని, అందుకే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం తాజా నిర్ణయాల ద్వా రా పార్టీ ప్రాధాన్యత పెరుగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.