3 August, 2026 | 3:57 AM

రాహుల్‌దే బాధ్యత!

03-08-2026 02:29 AM
  1. రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు దురదృష్టకరం
  2. స్పందించకపోతే సమర్థించినట్టే 
  3. యువత ఓట్లతో గెలిచి వారినే అవమానిస్తారా?
  4. గతంలోనూ ‘బీరు, బిర్యానీ’ బ్యాచ్ వ్యాఖ్యలు
  5. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి
  6. రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంజనీ రింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్‘ అంటూ వ్యాఖ్యలు చేయడం తెలంగాణ యువతతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లను అవమానించేలా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నైతిక బాధ్యత వహిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ప్రపంచవ్యాప్తంగా భారత ఇంజనీర్లు అగ్రశ్రేణి కంపెనీలకు నాయకత్వం వహిస్తూ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

అంతరిక్షంలోకి రాకెట్లను పంపడం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సాంకేతిక సంస్థలను నడిపించడం వరకు భారత ఇంజినీర్లు విశేష సేవలందిస్తున్న సమయంలో వారిని ‘క్రిమినల్ వేస్ట్‘గా పేర్కొనడం అత్యంత దుర దృష్టకరమని మండిపడ్డారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇంజినీర్ల ను అవమానించడం కాంగ్రెస్ పార్టీ విధానమా? దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. రేవంత్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు రాహుల్‌గాంధీ స్పందించకపోవడం, క్షమాపణ చెప్పాలని ఆదేశించకపోవడం, తాను కూడా స్పందించకపోవడం సీఎం వ్యాఖ్యలను సమర్థించినట్లేనని ఆరోపించారు.  

రాహుల్.. మౌనం ఎందుకు?

యువతే రేపటి భారతదేశ నిర్మాతలన్న విషయాన్ని రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత పోషించిన పాత్ర ను గుర్తు చేస్తూ, యువతతో పెట్టుకుంటే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీకి చరిత్రే చెబుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలోనూ, యూపీఏ హయాంలోనూ యువత తమ శక్తిని చూపించిందని, ఆ చరిత్రను రాహుల్‌గాంధీ గుర్తుంచుకోవాలన్నారు. 

ప్రజా స్వామ్యం, రాజ్యాంగం, నైతిక విలువలు, యువత గౌరవం గురించి తరచూ మాట్లాడే రాహుల్‌గాంధీ, తమ పార్టీ సీఎం యువతను అవమానిస్తే మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం సభల్లో ప్రసంగాలు చేయ డం వల్ల నాయకత్వ స్థాయి పెరగదని, తమ పార్టీ చేసిన తప్పులను సరిదిద్దుకోవ డం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసం పొందగలరని వ్యాఖ్యానించారు. తెలంగా ణ యువత ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే యు వతను అవమానించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

రేవంత్‌రెడ్డి గతంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులను ‘బీరు బ్యాచ్‘ అంటూ అవమా నించా రని కేటీఆర్ గుర్తు చేశారు. విద్యార్థుల ఉద్యమాలను తక్కువ చేసి మాట్లాడడం, ప్రశ్నించే వారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లు మాత్ర మే కాకుండా అధ్యాపకులను కూడా ‘క్రిమినల్ వేస్ట్‘ అంటూ అవమానించడం మరిం త బాధాకరమని పేర్కొన్నారు.

విద్యార్థుల ఆత్మగౌరంపై దాడి!

దేశ ప్రగతి కోసం తమ జీవితాలను అం కితం చేస్తున్న అధ్యాపకులు, గురువులను కూడా రేవంత్‌రెడ్డి తక్కువ చేసి మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. విద్యార్థుల ఆత్మ గౌరవం, యువత ఆత్మవిశ్వాసంపై దాడి చేసేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. విద్యార్థులను, యువతను, ఇంజనీ ర్లను అవమానించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇంజినీర్లు, గురువులు ‘క్రిమినల్ వేస్ట్‘ కాదని, యువతను హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే అసలు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత వ్యాఖ్యలు కావని, అవి కాంగ్రెస్ పార్టీ వైఖరినే ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్ర భుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి ఇద్దరూ విద్యార్థులు, ఇంజనీర్లు, అధ్యాపకులకు బేషర తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు.

ఇప్పటికే ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్ చేత మోసపోయిన తెలంగాణ యువత అన్నింటినీ గమనిస్తోందని కేటీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలను యువత మరవదని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని పేర్కొన్నారు.  

కాంగ్రెస్సే  ‘క్రిమినల్ వేస్ట్’

ఇంజినీర్లు, గురువులు క్రిమినల్ వేస్ట్ కాదు.. యువతను అడుగడుగునా మోసం చేస్తున్న కాంగ్రెస్సే అసలు సిసలైన ‘క్రిమినల్ వేస్ట్’ అని కేటీఆర్ విమర్శించారు. ముఖ్య మంత్రితో పాటు ఇంత దిగజారుడు సీఎం ను రాష్ట్రానికి పంపిన రాహుల్‌గాంధీ కూడా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదన్నారు.