3 August, 2026 | 3:51 AM

బోనమెత్తిన లష్కర్

03-08-2026 02:24 AM
  1. వాడ వాడలా జాతర
  2. భక్తజన సంద్రంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం
  3. పెద్దఎత్తున బోనాలు సమర్పించిన భక్తులు
  4. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
  5. అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బండి, రాష్ట్ర మంత్రులు, మాజీమంత్రి కేటీఆర్

సికింద్రాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): లష్కర్ బోనాల మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడ వాడలా భక్తులు బోనాల ఊరేగింపు నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటె త్తారు. అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కతో కలిసి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అంతకుముందు ఉదయం మంత్రి పొన్నం ప్రభా కర్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి బంగారు బోనంతో పాటు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ అమ్మ వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు పేర్కొన్నారు.

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ కే లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ, ప్రభుత్వ సలహాదారులు హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని, నవీన్ యాదవ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, మల్లారెడ్డి, ముఠా గోపాల్, సీపీ సజ్జనార్, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా అమ్మవారిని దర్శించుకున్నారు. 

నేడు రంగం

ఆలయం వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు అత్యంత విశిష్టమైన రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. భవిష్యవాణిని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. 

ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి

లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై భక్తులు, జోగిని శ్యామల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీఐపీల తాకిడి పెరగడంతో సామాన్య భక్తులు క్యూ లైన్లలో రోడ్డుపైనే గంటల తరబడి బోనం ఎత్తుకుని నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. మధ్యా హ్నం అమ్మవారిని దర్శించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన రాకకు అరగంట ముందు నుంచి భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు.

దీంతో బోనం ఎత్తుకుని క్యూలో ఉన్న వారు నీరసించిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఏడాది కొత్తగా 14 మంది సభ్యులతో కూడిన కొత్త పాలకమండలిని ప్రభుత్వం నియమించింది. వీరే కాకుండా మరో ముగ్గురు సభ్యులను రెండు రోజుల క్రితం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్సవాలు సజావుగా సాగేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిన కమిటీ సభ్యులు భక్తులకు సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయ ప్రాంగణంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి సహకరించినందుకు కనీసం ఒక్క సభ్యుడు కూడా కనిపించిన దాఖలాలు లేవని అంటున్నారు. కమిటీ సభ్యులంతా భుజాలపై కండువాలు, మెడలో ఐడీ కార్డులు వేసుకొని తమ నాయకులు వచ్చినప్పుడు వారి వెంట తిరగడం తప్ప వారి చేసింది ఏమీ లేదని, పలువురు భక్తులు బహిరంగంగానే ఆరోపించారు. కమిటీ సభ్యులు తమ కుటుంబ సభ్యులను, తమకు తెలిసిన వారిని నేరుగా తీసుకెళ్లి అమ్మవారిని దర్శనం చే యించేందుకు చొరవ చూపారే తప్ప సాధారణ భక్తులను పట్టించుకో లేదని శివశక్తులు, జోగినులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.