3 August, 2026 | 3:39 AM

డిప్యూటేషన్ల రద్దు.. దందాకేనా!

03-08-2026 02:11 AM
  1. ఈఎస్‌ఐలో లోలోపల ‘మామూళ్ల’ మంతనాలు?
  2. ఇంకా పలువురు అదే పోస్టుల్లో విధులకు హాజరు
  3. త్వరలోనే కొందరికి డిప్యూటేషన్లలో కొనసాగేలా ఉత్తర్వులు?
  4. ఈఎస్‌ఐలో అంతర్గత ఉత్తర్వులపై ఉద్యోగుల్లో చర్చ

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ)లో డిప్యూటేషన్ల రద్దు ఉద్యోగవర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఇలా డిప్యూటేషన్లను రద్దు చేసినప్పటికీ.. చాలా మంది ఇంకా అదే పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తుండటంతో.. విస్మయం వ్యక్తమవుతోంది. తెర వెనుక ఏం జరుగుతుందనే చర్చకూడా మొదలయ్యింది.

అంటే.. డిప్యూటేషన్లు రద్దు అనేది కేవలం లోలోపల ఆమ్యామ్యాలు మాట్లాడుకుని.. తిరిగి కొనసాగించేందుకేనా.. అనే అసంతృప్తి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈఎస్‌ఐలో ఉద్యోగుల డిప్యూటేషన్ రద్దు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 85 వరకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, నాచారం, రాచంద్రాపురం, వరంగల్, కాగజ్‌నగర్‌లో ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటినీ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.

అయితే గడిచిన చాలా సంవత్సరాలుగా రెగ్యులర్ డైరెక్టర్‌ను ప్రభుత్వం నియమించడం లేదు. దీనితో కిందిస్థాయి అధికారులదే ఆడింది ఆట.. పాడింది పాటగా తయారయ్యిందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా.. జూలై 18న జాయింట్ డైరెక్టర్ (మెడికల్) కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ స్థాయిల్లో ఉన్న డైవర్షన్, డిప్యూటేషన్లన్నింటినీ రద్దు చేస్తున్నామని, వెంటనే ఇలా డైవర్షన్, డిప్యూటేషన్లపై కొనసాగుతున్న వారందరూ రిలీవ్ అయి.. తమతమ ఒరిజినల్ పోస్టింగుల్లో చేరాలంటూ ఆదేశాలు (మెమో) జారీచేశారు.

సుమారు వంద మంది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 85 వరకు డిస్పెన్సరీలు, నాలుగు ఆసుపత్రుల్లో పరిశీలిస్తే.. కనీసం 80 నుంచి 100 మంది వరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ స్థాయిల్లో డైవర్షన్, డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నవారు ఉన్నట్టు తెలుస్తుంది. ఒక దగ్గర పోస్టింగ్ ఉండి... వేరే డిస్పెన్సరీల్లో, ఆసుపత్రుల్లో డిప్యూటేషన్‌పై గానీ డైవర్షన్ మోడ్‌లోగాని పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ పద్ధతిలో పనిచేస్తున్నవారు.. ఎక్కడా కూడా సరిగా విధులకు హాజరు కావడం లేదని, పైగా డిస్పెన్సరీలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నవారు..

తమ ఇంటి నుంచే పనులు చేస్తున్నారని, ఇంటివద్దకే రికార్డులు, హాజరు పట్టికలను తెప్పించుకుని సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు విరివిగా ఉన్నాయి. ఇక సదరు డిస్పెన్సరీకి రావాలన్నా.. తమ ఇష్టారాజ్యంగా వస్తున్నారు.. పోతున్నారనే వదంతులు కూడా ఉన్నాయి. దీనితో అటు ఈఎస్‌ఐ ఐపీ లబ్ధిదారులకు, అలాగే డిస్పెన్సరీల్లో అవసరానికి ఇన్‌చార్జీలు అందుబాటులో ఉండటం లేదనే అసంతృప్తి కూడా ఐపీ లబ్ధిదారుల్లో ఉంది.

ఇక ఇన్‌చార్జీలే తమ బాధ్యతలను విస్మరించి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే..  ఇన్‌చార్జీల పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉంటే.. మిగతా ఉద్యోగులు విధులు సరిగ్గా ఎలా నిర్వర్తిస్తారు? ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అనే సామెతలాగే.. మిగతా ఉద్యోగులు కూడా డుమ్మాలు కొట్టడంలో పోటీ పడుతుంటారనే అపవాదు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటేషన్లను అన్నీ ఒకేసారి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారని తెలుస్తుంది.

రద్దు.. అమలయ్యేనా..

ఈ డిప్యూటేషన్ల రద్దు ఆదేశాలు జూలై 18న జారీచేసిన వెంటనే అమలు చేయాలని, తక్షణం తమ ఒరిజినల్ పోస్టింగ్‌ల్లో చేరాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అమలులో మాత్రం అంత వేగం కనపడటం లేదు. ఎందుకంటే.. చాలామంది ఇప్పటికీ.. తమకు డిప్యూటేషన్‌పై ఉన్న పోస్టులకు సంబంధించిన విధులకు హాజరువుతున్నారంటూ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. అలాంటప్పుడు డిప్యూటేషన్లు, డైవర్షన్లను ఎందుకు రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారంటే సమాధానం రావడం లేదు. అయితే ఈ డిప్యూటేషన్లు, డైవర్షన్లను రద్దు చేస్తూ.. జాయింట్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలకు డైరెక్టర్ ఆఫ్ ఈఎస్‌ఐ(ఐఎంఎస్) అనుమతి ఉందా.. లేదా అనేది మాత్రం తేటతెల్లం కావడం లేదు.

తెరవ వెనక మంతనాలు..

నిజానికి ఈఎస్‌ఐలో తాజాగా జారీచేసిన ఈ ఉత్తర్వుల వెనుక కొందరు అధికారుల హస్తలాఘవం ఉన్నట్టుగా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటేషన్లు, డైవర్షన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ.. దాదాపు పక్షం రోజులు అవుతున్నా.. చాలామంది ఉద్యోగులు, ఇన్‌చార్జీలు ఎప్పటిలాగే అదే పోస్టుల్లో విధులకు హాజరవుతున్నారు. అసలు తెరవెనుక.. ఈఎస్‌ఐ ఉన్నతాధికారులతో మంతనాలు సాగించి.. తృణమో.. ఫలమో సమర్పించుకుని.. అదే పోస్టుల్లో కొనసాగుతున్నట్టుగా ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. అంటే.. ఆ తృణమో.. ఫలమో కోసమే ఈ ఆదేశాలు జారీచేశారా? అనే చర్చకూడా సాగుతోంది.

అన్నీ రద్దుచేసి.. వెంటనే అమలు కావాలంటూ.. ఆదేశాలు ఇచ్చి.. వెనక మాత్రం ఒప్పందాలు కుదుర్చుకుని.. అదే పోస్టుల్లో కొనసాగేలా వ్యవహరించడంతో.. అసలు ‘మామూలు’ కోసమే ఈ ఉత్తర్వుల వ్యవహారం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. పైగా కొద్ది రోజుల్లోనే ఇలా ఉన్నతాధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఉద్యోగులు, ఇన్‌చార్జీలకు సంబంధించి అదే డిప్యూటేషన్, డైవర్షన్ పోస్టుల్లో కొనసాగేలా మరో ఉత్తర్వులు వస్తాయనే అంచనాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈఎస్‌ఐలో ‘మామూలు’ వ్యవహారాలు చాలా భారీగానే ఉంటాయనే విమర్శలకు తాజా డిప్యూటేషన్ల రద్దు ఉత్తర్వులు నిజం చేస్తున్నాయి..!