అనుమతులు రెండు.. నిర్మాణం ఒకటే!
- రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణం
- దుండిగల్ సర్కిల్లో టౌన్ ప్లానింగ్ మాయ
- ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
కుత్బుల్లాపూర్, జూన్ 14(విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పలువురు అనేకసార్లు ఫిర్యాదు చేసిన నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుం టున్నారే తప్ప అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడమే మర్చిపోయారు. నోటీసులతో బిల్డర్లను తమ దారికి తెచ్చుకొని నిర్మాణాలు యధావిధిగా కొనసాగడానికి తోడ్పాటు అందిస్తున్నారని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. దుండిగల్ సర్కిల్లో ఎక్కడ చూసిన పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు అనుమతులతో ఒకటే కమర్షియల్ నిర్మాణం..
దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్ పల్లి డివిజన్ నిరంజన్ కాలనీలో సర్వే నెంబర్ 60 లో ఓ బిల్డర్ చట్ట ప్రకా రం రెండు స్టిల్ట్+2 రెసిడెన్షియల్ అనుమతులు పొందాడు. అయితే సదరు బిల్డర్ అనుమతుల ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఒకటే భవన నిర్మాణాన్ని కమర్షియల్ గా నిర్మిస్తున్నాడు.సదరు అక్రమ నిర్మాణంపై సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు పలు ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,అంతేకాకుండా ముడుపులతో సరిపెట్టుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన అధికారులే వాటికి వంత పాడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. కోర్టులు, ప్రభుత్వం ఎన్ని మొట్టికాయలు వేసినా అధికారుల తీరు మారడం లేదని విమర్శలు ఉన్నాయి.ఇప్పటికైనా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ దృష్టి సారించి దుండిగల్ సర్కిల్లో చోటుచేసుకుంటున్న అక్కమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు.






