కూరగాయల విక్రయానికి వెళ్తూ అనంతలోకానికి..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతుల దుర్మరణం
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆదిలాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కూరగాయలను విక్రయించడానికి వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చో టుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తలమడుగు మండలం పల్లి (బి) గ్రామానికి చెందిన నలుగురు రైతులు ఆనంద్, నారాయణ, భీం రావు, నగేష్ కూరగాయలను విక్రయించేందుకు గురువారం తెల్లవారుజామున ఆటో లో ఆదిలాబాద్ కు బయలుదేరారు.
మావల మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారిపై వెనక నుంచి వచ్చిన లారీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు ఆనంద్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడ్డ నారాయణ, భీంరావు, నగేష్ లను స్థానికులు అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐతే చికిత్స పొందుతూ నారాయణ మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మావల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.






