వచ్చేలోగా అంతా బూడిదే..!
అగ్నిమాపక కేంద్రానికి నోచుకోని తుంగతుర్తి నియోజకవర్గం
దశాబ్దాలుగా నెరవేరని నియోజకవర్గ ప్రజల ఆశలు
జిల్లా కేంద్రంతో పాటు ఇతర జిల్లాలోని ఫైర్ స్టేషన్ల పైనే ఆధారం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఫిబ్రవరి 24: ప్రభుత్వాలు మారినా,ఎంతమంది ప్రజాప్రతినిధులు మారిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల, రైతుల తలరాతలు మారడం లేదు. పెరుగుతున్న జనాభా,వాణిజ్య కార్యకలాపాల దృష్ట్యా, అగ్ని ప్రమాదాలను సకాలంలో అరికట్టి ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించడానికి మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే స్థానిక గిరిజనుల విజ్ఞప్తి మేరకు తుంగతుర్తి - నాగారం రహదారిపై ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక ఎకరం స్థలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.కానీ ప్రభుత్వాలు మారిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్య ఇప్పటికీ నెరవేరలేదు. రానున్నది వేసవికాలం కావున తరచుగా సంభవించే అగ్ని ప్రమాదాల నుండి స్థానిక ప్రజలకు రక్షణ కల్పించి ఈ ప్రాంతంలోని దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా పోరాటం
తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పటివరకు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగిన జిల్లా కేంద్రం సూర్యాపేటతో పాటు సమీప జిల్లా కేంద్రాల్లోని అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ రావాల్సి వస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గంలోని మండలాలన్నీ సూర్యాపేట అగ్నిమాపక కేంద్రంపైనే ఆధార పడాల్సి ఉంది. రానున్న వేసవిలో గ్రామాల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.వెంటనే మంటల్ని ఆర్పాల్సి ఉండగా జిల్లా కేంద్ర నుండి ఇక్కడికి వచ్చేసరికి జరిగే నష్టం పూర్తిగా జరిగిపోతుంది.
ఇటీవల జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామ సమీపంలో జమాయిల్ తోట అకస్మాతుగా అగ్ని ప్రమాదానికి గురైంది. వెంటనే అక్కడి స్థానిక రైతులు సూర్యాపేటలోని ఫైరింజన్ కోసం ఫోన్ చేయగా అందుబాటులో లేదు. దీంతో నల్గొండ జిల్లా నకిరేకల్ నుండి ఫైరింజన్ వచ్చేసరికి జరగాల్సిన పూర్తి నష్టం జరిగింది. ఇటువంటి ప్రమాదాలను వెంటనే అదుపు చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకుని తుంగతుర్తి నియోజకవర్గంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు వేడుకుంటున్నారు.
ఫైర్‌స్టేషన్‌ను వెంటనే మంజూరు చేయాలి
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ రక్షణ కోసం ఇప్పటివరకు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం.అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దూరప్రాంతాల నుండి ఫైరింజన్లు రావడానికి సమయం పడుతుంది. దీనివల్ల భారీ ఆస్తి,ప్రాణనష్టం జరుగుతుంది. మా ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇప్పటికైనా మా ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.
- మన్నె సింహాద్రి యాదవ్, సామాజికవేత్త, కుంచమర్తి గ్రామం




