పేదరికం, సామాజిక వివక్షలే మానవ అక్రమ రవాణాకు కారణాలు
హైదరాబాద్ వర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై
పటాన్ చెరు, ఆగస్టు 4 (విజయక్రాంతి): పేదరికం, నిరుద్యోగం, లింగ అసమానత, సామాజిక వివక్షలను మానవ అక్రమ రవాణాకు ప్రధాన కారణాలుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం, సోషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అజైలియు నియుమై అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్‌ఎస్) ఆధ్వర్యంలో ‘భారతదేశంలో మానవ అక్రమ రవాణాపై అంతర్ విభాగ పరిశోధన ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై మంగళవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
జీఎస్ హెచ్‌ఎస్ డీన్ డాక్టర్ రథిన్ రాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ నియుమై మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా యొక్క సంక్లిష్టమైన, బహుముఖ స్వభావాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిని ఒకే విజ్జాన శాస్త్ర దృక్కోణంతో అర్థం చేసుకోలేమని ఆమె స్పష్టీకరించారు. అక్రమ రవాణాకు ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక అంశాలలో మూలాలు ఉన్నాయని, అందువల్ల దీనికి సోషియాలజీ, చట్టం, ప్రజా విధానం, అర్థశాస్త్రం, ప్రజారోగ్యం, సాంకేతికతతో కూడిన అంతర్ విభాగ పరిశోధన విధానం అవసరమని చెప్పారు.






