4 April, 2026 | 1:42 AM

అయ్యో పాపం.. నీడ కరువాయె!

04-04-2026 12:00 AM

మండుటెండలో ప్రయాణికుల అవస్థలు

మొండికుంట, అశ్వాపురం ప్రధాన కూడలిలో తప్పని నిరీక్షణ

పైపులైన్ల కోసం షెల్టర్ తొలగించి.. తిరిగి నిర్మించని వైనం

ఆర్టీసీ, పంచాయతీల నిర్లక్ష్యంపై మండిపడుతున్న ప్రజలు

అశ్వాపురం, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంతో పాటు మొండికుంట పంచాయతీ పరిధిలోని ప్రధాన కూడలిలో ప్రయాణికుల కష్టాలు అరణ్య రోదనగా మారాయి. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఆ నాలుగు రోడ్ల కూడలిలో.. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు కనీసం నిలువనీడ కరువైంది. ఎర్రటి ఎండలో బస్సులు ఎప్పుడు వస్తాయోనని ఆకాశం వైపు చూస్తూ.. మండుటెండలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. మొక్కుబడిగా  ఈమధ్య కాలంలో మొండికుంటలో చలివేంద్రం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది

ప్రధాన కూడలి.. కానీ ప్రాథమిక వసతులు శూన్యం

ఈ ప్రాంతం మణుగూరు, కొత్తగూడెం, తుమ్మలచెరువు, భద్రాచలం వెళ్లే మార్గాలకు ప్రధాన కూడలి. నిత్యం వందలాది మంది ప్రయాణికులు ఈ కేంద్రం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉండే ఈ కూడలిలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఆర్టీసీ అధికారులదా? లేక గ్రామ పంచాయతీదా? బాధ్యులు ఎవరైనా.. అధికారుల నిర్లక్ష్యానికి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నది మాత్రం సామాన్య ప్రయాణికులే. పసిపిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా మారింది.

హామీలు ఏమయ్యాయి? గత పాలకవర్గం ఏం చేసినట్లు?

గతంలో ఈ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఉండేది. అయితే, మిషన్ కాకతీయ పైపులైన్ల పనుల నిమిత్తం అధికారులు దాన్ని తొలగించారు. పనులు పూర్తయ్యాక తిరిగి బస్ షెల్టర్ నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత మాట మార్చారు. కనీసం ఆ రోజు ఉన్న గత పాలకవర్గం సైతం ఈ సమస్యపై ఏమాత్రం దృష్టి సారించకపోవడం గమనార్హం. ప్రజాప్రతినిధుల, అధికారుల అలసత్వం వల్లే నేడు ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజల డిమాండ్ ఇదే..

ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నూతన ప్రజాప్రతినిధులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, స్థానిక వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా వెంటనే ఆధునిక బస్ షెల్టర్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.