4 April, 2026 | 3:24 AM

చెపాక్‌లో పంజాబ్

04-04-2026 01:39 AM

దంచికొట్టిన ప్రియాన్ష్, శ్రేయాస్

చెన్నైకు మరో ఓటమి

పంజాబ్‌కు రెండో విజయం                                                                             

వేదిక మారినా చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయం అందలేదు. సొంతగడ్డపై బ్యాట్‌తో అదరగొట్టినా బౌలర్లు రాణించకపోవడంతో సీఎస్కే వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఆయుశ్ మాత్రే, దూబే మెరుపులు అలరించినా.. పంజాబ్ టాపార్డర్ చెలరేగిపోవడంతో చెన్నైకి నిరాశే మిగిలింది. ప్రియాన్ష్ ఆర్య చుక్కలు చూపిస్తే, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో విజయాన్ని అందించాడు. పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.

చెన్నై, ఏప్రిల్ 3: చెపాక్ పిచ్‌పై టాస్ గెలిచిన పంజా బ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌తో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై అదరగొట్టింది. పేలవ బ్యాటింగ్‌ను అధిగమిస్తూ భారీస్కోర్ సాధించింది. నిజానికి భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ (7) మరోసారి ఫెయిలయ్యాడు. అయితే ఆ యుశ్ మాత్రే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దుమ్మురేపారు. ముఖ్యంగా చిచ్చర పిడుగు మాత్రే రెచ్చిపోయా డు. పంజాబ్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

అటు రుతురాజ్ కూడా ధాటిగానే ఆడాడు. వీరిద్దరూ 55 బంతుల్లోనే 96 పరుగుల పార్టనర్ షిప్ సాధించారు. రుతు రాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటవగా.. ఆయుశ్ మాత్రే 43 బంతు ల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. తర్వాత కార్తీక్ శర్మ విఫలమైనా.. శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మె రిపించారు.

సర్ఫరాజ్ ఖాన్ కేవలం 12 బంతుల్లోనే 32 (6 ఫోర్లు, 1 సిక్సర్ ) పరుగులు చేయగా... దూబే కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడా డు. కేవలం 27 బంతుల్లోనే 45 (5 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశాడు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ 209 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు, చాహల్ 1 వికెట్ పడగొట్టారు. అయితే అర్షదీప్ సింగ్ 41, బార్ట్ లెట్ 48, యెన్సన్ 43 పరుగులు సమర్పించుకున్నారు.

పిచ్ ఫ్లాట్‌గా ఉండటం తో పంజాబ్ కింగ్స్ ఆరం భం నుంచే రెచ్చిపోయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌కు కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ప్రియాన్స్ ఆర్య చెన్నై బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 11 బంతుల్లోనే 39 (3 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. అటు ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 68 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 34 బంతుల్లో 43 (6 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేయగా.. తర్వాత శ్రేయాస్ అయ్యర్ విధ్వంసకర ఇ న్నింగ్స్ ఆడాడు.

చెన్నై బౌలర్లపై భారీ షాట్ల తో విరుచుకుపడ్డాడు. కూపర్ కన్నోలీతో కలిసి 32, నేహల్ వధేరాతో కలిసి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్ర మంలో కేవలం 29 బంతుల్లోనే 50 (4 ఫో ర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. అటు కూపర్ కన్నోలీ 36 పరుగులకు ఔటైనా శశాంక్ సింగ్, స్టోయినిస్ పంజాబ్ విజయాన్ని పూర్తి చేశారు. పంజాబ్ మరో 8 బం తులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఇది రెం డో విజయం కాగా చెన్నై సూపర్ కింగ్స్‌కు వరుసగా రెండో ఓటమి.

స్కోరు బోర్డు

చెన్నై సూపర్ కింగ్స్: 209/5 (ఆయుశ్ మాత్రే 73, శివమ్ దూబే 45 , సర్ఫరాజ్ 32 ; విజయ్ కుమార్ వైశాక్ 2/38, చాహల్ 1/21)

పంజాబ్ కింగ్స్ : 210/5 (18.4 ఓవర్లు) (ప్రియాన్ష్ ఆర్య 39, శ్రేయాస్ అయ్యర్ 50, ప్రభ్ సిమ్రన్ సింగ్ 43 ; అన్షుల్ కాంబోజ్ 2/43, హెన్రీ 2/54)