దురాక్రమణల పరంపర!
పశ్చిమాసియాలో బీభత్సం సృష్టిస్తున్న యుద్ధానికి ఇజ్రాయెల్ నాంది పలికితే, అగ్నికి ఆజ్యం పోసింది అమెరికా. ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక, నాగరిక దేశమని చెప్పుకునే అమెరికా చరిత్రలో సామ్రాజ్యవాద ధోరణితో పలు యుద్ధాలు చేసి ముఖానికి రక్తం పులుముకున్నదనేది నిర్వివాదాంశం. పశ్చిమాసియాలో చమురు సంక్షోభానికి తెరలేపే ముందే అమెరికాలోని ట్రంప్ సర్కారు మొదట వెనిజులాపై తన ప్రతాపాన్ని చూపింది.
నికోలస్ మదురో ఒక మాదకద్రవ్యాల మాఫియా నాయకుడనే ప్రచారం సాగించింది. రాత్రికి రాత్రి వెనిజులా అధ్యక్షుణ్ణి బంధీ చేసింది. ఒక దేశాధ్యక్షుడిపై దాడిచేసి బంధీ చేసినా చెల్లుబాటు అవుతుందనే విదేశాంగ విధానం అమెరికాది. ట్రంప్ నాయకత్వంలోని అమెరికా అంతటితో ఆగలేదు. మాదకద్రవ్యాల బూచీతో వెనిజులాలోని చమురు క్షేత్రాలను గుప్పిటపట్టింది. అమెరికా సైనిక బలానికి భయపడే దేశాల్లో ఆ దేశం చేసే దుశ్చర్యలకు నిరసన వ్యక్తం కాకపోవడమే అమెరికాకు బలాన్నిస్తున్నది.
వెనిజులా చమురు నిల్వలపై నియంత్రణ కోసమే అమెరికా, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దురాక్రమణ చేసిందనేది తేటతెల్లమైంది. మదురో తర్వాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా.. చమురు, మైనింగ్ రంగాలను కాపాడుకోవడంలో దేశ సార్వభౌమత్వం కొరగాకుండా పోయింది. వెనిజులా భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. మదురోను బంధించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, ఒక స్వతంత్ర దేశంపై దురాక్రమణకు పాల్పడటమేమిటని విమర్శకులు ప్రశ్నించినా ఘనతవహించిన అమెరికాకు పోయేదేమీ లేదు.
వెనిజులాలోని చమురు, గ్యాస్, ఖనిజాలు గుప్పిటపట్టడమే ట్రంప్ సాధించిన ఘనకార్యంగా ప్రపంచమం తా చూడాల్సివుంటుంది!. వెనిజులా నుంచి చమురు దిగుమతిపైనే ఆధారపడిన క్యూబాపైనా ట్రంప్ కన్నుపడింది. వెనిజులా దురాక్రమణ తర్వాత క్యూబాను నిర్వీర్యం చేయడమే అమెరికా పనిగా పెట్టుకుంది. వెనిజులా నుంచి క్యూబాకు చుక్క చమురు అందకుండా ఆంక్షలు విధించిన అమెరికా ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభంలోకి నెట్టివేసింది.
దేశవ్యాప్త విద్యుత్ కొరతలు, ద్రవ్యోల్బణం కారణంగా క్యూబా దేశ చరిత్రలో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది. రష్యా నుంచి ఒకమేర చమురు సాయం అందుతున్నా దుర్భర పరిస్థితుల్లో క్యూబా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు పోరాడాల్సివస్తున్నది. ఆరు దశా బ్దాలుగా కమ్యూనిస్టు క్యూబాను కబళించేందుకు అమెరికా చేయని కుట్రలేదు.
అమెరికా సామ్రాజ్యవాదానికి కాస్ట్రో నుంచి ఇప్పటి నాయకత్వం వరకు తలవంచని క్యూబాకు మనుగడే పెద్ద సవాలుగా మారింది. చీకట్లు కమ్ముకున్న దేశంలో, ఆదాయాలు లేక నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల బతుకు నరకంగా మారింది. క్యూబాపై అమెరికా అమానవీయ ఆర్థిక యుద్ధాన్ని సాగిస్తున్నదని భారత్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితిలో పలు దేశాలు మొక్కుబడిగా తమ నిరసనను వ్యక్తం చేశాయి.
అంతటితో ప్రపంచ దేశాల బాధ్యత తీరింది. ఇరాన్‌ను భీకర దాడులతో నేలమట్టం చేస్తామని, పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిన తర్వాత క్యూబాను కూడా అంతం చేస్తామని ట్రంప్ దురహంకారంతో చేసిన ప్రకటనలకు ప్రపంచం నివ్వెరపోతున్నది. అమె రికా ఆగడాలు పశ్చిమాసియా యుద్ధం తర్వాతనైనా ఆగుతాయా?




