4 April, 2026 | 3:26 AM

ఆయన నిజంగా వెంకటరమణుడు

04-04-2026 01:40 AM

ఆచార్య మసన చెన్నప్ప :

ఇంటి నుంచి బయటి ప్రపంచంలోకి వెళ్లిన్నప్పుడు ప్రతిరోజు తప్పకుం డా తమ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునే ఒక వ్యక్తి గురించి తెలిసినప్పుడు నా హృదయం ఉప్పొంగి పోయింది. వైష్ణవ కుటుంబంలో జన్మించిన ఆయనకు చిన్నప్పటినుం చి అందరిలో పరమాత్మను దర్శించే దృష్టి అలవడింది. ఉపన్యాసకునిగా ఉన్నా, అధికారిగా ఉన్నా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నా, విధి నిర్వహణలో శ్రద్ధ, ధర్మం పట్ల విశ్వా సం,  నిరాడంబరత, నిర్మలత్వం కల్గిన ఆ వ్యక్తి ఎవరో కాదు, డాక్టర్ కె.వి.రమణాచారి ఐఏఎస్ (రిటైర్డ్).

లలితకళలతో అనుబంధం గల రమణాచారి గారికి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు రెం డు కళ్లు. ఒకదానికి అధ్యక్షులుగాను,  మరొక దానికి ఉపాధ్యక్షులుగాను తమ సేవలందిస్తున్నారు. ఒకసారి పరిషత్తు పనిమీద వారిని కలవడానికి తిలక్ రోడ్డులోనే ఉన్న దేవాదా య శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. వారప్పుడు కమిషనర్‌గా ఉన్నారు. లోపలికి విజిటింగ్ కార్డు పంపించి బయట నిలబడ్డా ను. మరుక్షణం వారు నా ముందు ప్రత్యక్ష మై ‘మనం సారస్వత బంధువులం ఎప్పుడై నా కలవచ్చు. రండి లోపలికి’ అని ఆహ్వానించారు. వారి మర్యాదకు నిజంగానే నేను పరవశించిపోయాను.

డా.రమణాచారి గారు కమిషనర్‌గా ఉన్నప్పుడు గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ‘చెన్నప్ప గారూ! పుష్కరాలకుగాను మీరు కాళేశ్వరం వెళ్లగలరా?’ అని ఫోన్‌లో అడిగా రు. ఉపన్యాసం చేయడానికని నాకర్థమయ్యింది. “తప్పకుండా వెళ్తాను సార్! కాని బస్సులో వెళ్లలేను’ అన్నాను. “మిమ్మల్ని బస్సులో పంపిస్తానా? కారులోనే వెళ్లవచ్చు”అని మృదువుగా చెప్పారు. వెంటనే నాకు ఐడియా వచ్చింది.

నేనొక్కడినే పోతే పుష్కరస్నానఫలం.. నా కొక్కడికే దక్కుతుంది. నా అర్ధాంగి ప్రమీలతో, బంధువులతో వెళితే అందరికీ ఆ పుణ్యం దక్కుతుందనుకొని,  “ఇన్నోవా కారైతే మేం నల్గురైదుగురం వెళ్లి రాగ లం సార్ “అన్నాను” దానికేం నిరభ్యంతరంగా వెళ్లిరండి” అని అనుమతించారు.

మేం ఐదుగురం బయల్దేరి కాళేశ్వరం వెళ్లేసరికి సాయంత్రం మూడు గంటలు కావొ స్తుంది.  పుష్కర స్నానం ముగించుకొని వచ్చేసరికి బాగా ఆలస్యమైంది. ఆకలి వేసింది. ఎక్కడ ఆగాలో, ఎక్కడ భోజనం చేయాలో తెలియక ఒక చోట ఆగిపోయాం. ఒక వ్యక్తి మాదగ్గరకు వచ్చి ‘మీరే చెన్నప్ప గారు కదా!’ అని అడిగి సమీపంలోని బ్రాహ్మణ సత్రానికి తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో సత్రంలో వేడివేడి భోజనం లభించడం ఆశ్చర్యాన్ని కల్గించింది.

ఇదంతా రమణాచారి గారి ఏర్పా టే.  లోకంలో  సాధారణంగా ఒక వ్యక్తికి ఒక పనిని అప్పజెప్పి ఆ తర్వాత అతనిమానన అతణ్ణి విడిచిపెట్టే అధికారులుంటారు. కాని ఆవ్యక్తి ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూసే గొప్ప సంస్కారం డా.రమణాచారిలో నేను చూశాను ప్రత్యక్షంగా.

ఆరోజు సాయంత్రం నా ప్రసంగంలో పుష్కర వైభవంతోపాటు తల్లియైన గోదావరితో పుత్రికా సమానురాలైన ప్రాణహితకు గల అనుబంధాన్ని వివరించాను. తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు ప్రాణహిత గోదావరిలో ఇమిడిపోయి ఉన్నట్లు వర్ణించా ను. ప్రసంగానంతరం మళ్లీ ప్రసాదం తీసుకొని అదేరాత్రి ఏ ఇబ్బందీ లేకుండా ఇంటికి చేరుకున్నాను. అప్పటికి ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపింపబడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది.

ఆ సందర్భాన్ని పుష్కరించుకొని 26 మే 2018 నాడు గొప్ప సాహిత్యోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా అప్పటి భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు విచ్చేశారు. ఆ సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉన్న రమణాచారి గారు పరిషత్తు సేవలను ప్రస్తావిస్తూ “పరిషత్తు.. దీపం లేక పోతే తెలంగాణ అంతా చీకటే” అన్న నా కొటేషన్‌ను వినిపించారు. సభలోనే ఉన్న నేను వారి పలుకులను విని తన్మయత్వానికి లోనయ్యాను.

ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నా మనస్సు ఉప్పొంగిపో తుంది. తెలంగాణ రాష్ట్రావతరణకు ముందు నేను ‘తెలంగాణోదయం’ పద్య కావ్యం రాశా ను. దానిలో ‘ఒక్క బుక్క’ అనే శీర్షిక ఉంది. నా బాల్యంలో చింతపల్లిలో చదువుకుంటున్నప్పుడు జరిగిన సంఘటన అది. దాన్ని చదివి రమణాచారి గారు “చెన్నప్ప ఆకలితో ఉన్న ఒక పెద్దాయనకు ఒక బుక్క అన్నం పెట్టాడు. ఆ ఒక్క బుక్కే అతణ్ణి ఈనాటికీ నడిపిస్తుంది” అని ముందుమాట అందించారు. ఈ మాటల్ని నే నెన్నిసార్లు చదువుకున్నానో నా పుస్తకం తెరిచి. 

రమణాచారి గారు ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. కులీ కుతు బ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా స్పోర్ట్స్ అథారిటీ కమిషనర్‌గా, సర్వశిక్షా అభియాన్ కార్యదర్శిగా, రాష్ట్ర చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ ఎం.డి గా పనిచేశారు. వారేపదవిలో ఉన్నా వారి ముద్ర కనిపిస్తుంది.

ఒకసారి పాతపట్నం వెళ్లాను. యాబై ఏళ్ల క్రితం నాటి పాత పట్నానికి, నేటి పాత పట్నానికి తేడా కనిపించింది. దానికి కారణం వారు కుడా అధికారిగా ఉం డడమే. హైదరాబాద్‌లోని సింగపూర్ టౌన్‌షిప్ వారి దూర దృష్టికి చక్కని నిదర్శనం. వారి సలహాలు పాటించిన వారు ముఖ్యం గా మంత్రులు లాభపడినారని నా భావన.

జంట నగరాలలో టిక్కెట్ పెట్టి నాటకాల ను చూసే విధంగా నాటకరంగాన్ని ప్రోత్సహించిన వారు రమణాచారి గారే. 2007లో రమణాచారి గారు టి.టి.డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమింపబడిన తర్వాత దేవస్థానం రూపురేఖలే మారిపోయాయి. అడుగడుగు న దైవభక్తి వెళ్లివిరిసే విధంగా తిరుమలను అభివృద్ధి పరిచారు. తిరుమలలో ఉచిత భోజన సదుపాయం వారి హయాంలోనే మొదలైంది. వారి వల్లనే ‘అనంతస్వర్ణమయ పథకం’కార్యరూపం దాల్చింది. వెంకటేశ్వరు ని రథయాత్ర రాష్ట్రంలోని నలుమూలలకు వెళ్లే అవకాశం లభించింది. తల్లులకు వారి చంటి పిల్లలకు నేరుగా స్వామివారి దర్శనం సాధ్యమైంది. వృద్ధులకు మేలైంది. 

నేను ఓ.యూ తెలుగు శాఖలో ఆచార్యునిగా ఉన్న సమయంలో (2009)లో వారి పీహెచ్‌డి ‘వైవా’కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. ‘పద్య కవిత్వం -- వస్తు వైవిధ్యం’అనే వారి సిద్ధాంత గ్రంథం ప్రామాణికమైంది. పరిశోధనాలోను వారి ప్రావీ ణ్యం కనిపిస్తుంది. రమణాచారి గారు సామాజిక క్షేత్రంలో రాణించినట్లే సాహిత్య క్షేత్రంలో నూ రాణించారు. వారి తండ్రిగారి గురించి చెప్పాలంటే, రాఘవాచార్యులు గొప్ప ఆధ్యాత్మికవేత్తలు.

వారి ‘ఆనందనిలయం’లో చేరిన వారదే అదృష్టం! రమణాచారి గారు 2015 లో ఓ.యూలో జరిగిన నా పదవీ విరమణ కార్యక్రమానికి, యాదగిరిగుట్టలో పని ముగించుకొని సకాలానికి వచ్చారు. ముఖ్యఅతిథిగా ప్రసంగం చేశారు. విద్యార్థుల పక్షా న వారు నా చేతికి తొడిగిన ‘స్వర్ణకంకణం’ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. నేటికీ జంట నగరాల్లో సాహిత్య కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ అందరి మన్ననలను చూరగొంటున్నారు. అందరితోనూ ప్రేమ పూర్వకంగా వ్యవహరించడం, రమణాచారిలో ఉన్న గొప్ప సుగుణం!