4 April, 2026 | 1:38 AM

ఇబ్రహీంపట్నం ‘పీఠం’ ఎవరిది?

04-04-2026 12:00 AM
  1. కోర్టు ఆదేశాలతో నేడు చైర్మన్ ఎన్నిక
  2. మున్సిపల్ పరిధిలో కఠిన ఆంక్షలు ఆంక్షలు: సీపీ సుధీర్ బాబు 
  3. అందరి కళ్ళు చైర్మన్ ఎన్నికపైనే 

రంగారెడ్డి, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో గత కొంతకాలంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు ముగింపు లభించనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తాజా షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కీలక ఎన్నిక నిర్వహించనున్నారు. ఒకవేళ ఎన్నిక ఏదైనా వాయిదా పడితే మరుసటి రోజైన ఏప్రిల్ 5న ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

అసలేం జరిగింది? వివాదానికి కారణాలేంటి?...

ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో  మొత్తం 24 వార్డు స్థానాలకు బీఆర్‌ఎస్ (BRS)కు స్పష్టమైన మెజార్టీ (14 వార్డులు) వచ్చినా, అధికార కాంగ్రెస్ (8 వార్డులు) గట్టి పోటీనిస్తోంది. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తిరుగుబాటుతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఆయన కిడ్నాప్ అయ్యారనే వార్తలు, ఆ తర్వాత తానే స్వయంగా బయటకు వచ్చి వివరణ ఇవ్వడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఫిబ్రవరి 17న జరగాల్సిన ఎన్నిక వాయిదా పడటంతో ఈ వివాదం కాస్తా హైకోర్టు మెట్లెక్కింది. నాలుగు వారాల్లోగా ఎన్నిక పూర్తి చేయాలని మార్చి 3న కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది.

మల్రెడ్డి వర్సెస్ మంచి రెడ్డి: ప్రతిష్టాత్మక పోరు..

ఈ మున్సిపల్ పీఠం దక్కించుకోవడం ఇరు పార్టీల నేతలకు జీవన్మరణ సమస్యగా మారింది.అధికార బలాన్ని ఉపయోగించి ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వర్గం పట్టుదలతో ఉంది.తమకు మెజార్టీ ఉందని, తమ అభ్యర్థి టేకు సుదర్శన్ రెడ్డికే చైర్మన్ పదవి దక్కాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వర్గం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది.

ఇప్పటికే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రహస్య క్యాంపుల్లో ఉన్నట్లు సమాచారం. గడిచిన రెండు నెలలుగా వాయిదాలు, క్యాంపు రాజకీయాలు, కోర్టు స్టేలతో సతమతమైన ఇబ్రహీంపట్నం రాజకీయం ఏప్రిల్ 4న క్లైమాక్స్కు చేరుకోనుంది. మరి ’మున్సిపల్ పీఠముడి’ వీడి చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగురుతుందా లేక హస్తం తన హవా చాటుతుందా అనేది వేచి చూడాలి!

ఇబ్రహీంపట్నంలో రేపు ఆంక్షలు..

ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు

మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మరియు వైస్ ఛైర్పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నేడు ఇబ్రహీంపట్నంలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  పట్టణంలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట గుమిగూడటాన్ని పూర్తిగా నిషేధించారు.

బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి ఎటువంటి అనుమతి లేదు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు అమలులో ఉంటా యి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు సహకరించాలని కమిషనర్ కోరారు. ఎవరైనా పోలీస్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.