బక్క చిక్కుతున్న మక్క రైతులు
- పంట చేతికొచ్చినా ధాన్యం అమ్ముకునేందుకు తప్పని తిప్పలు
- ప్రారంభం కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
- ఆందోళన కలిగిస్తున్న వర్ష సూచనలు
- వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల చేతిలో నలిగిపోతున్న రైతులు
- అడ్డగోలుగా దండుకుంటున్న కాంటాదారులు.
- పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు.
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 3 ( విజయక్రాంతి ): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తీరా అమ్ముకునేందుకు కూడా రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. దుక్కి దున్నే నాటి నుంచి పంట కాపు దశకు వచ్చే వరకు విత్తనాలు, ఎరువులు, కూలీలు, పంట తెగుళ్ళు వంటి వాటన్నింటిని అధిగమిస్తూ తీరా పంట చేతికి వచ్చిందని అమ్ముకునేందుకు మార్కెట్ వద్దకి వస్తే సకాలంలో అధికార యంత్రాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో దళారులు రైతాంగాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం అవుతోంది.
గత నెల రోజులుగా మొక్కజొన్న పంట చేతికి వచ్చి ధాన్యాన్ని మార్కెట్ ప్రాంతానికి తీసుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల కొరత సాకులు చూపి ఆలస్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నప్పటికీ 30 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉండగా కేవలం నాలుగు చోట్ల మాత్రమే కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో కేవలం రెండు కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరణ ప్రారంభమైంది.
ఇదే అదునుగా భావించిన దళారులు, కాంటా దారులు అతి తక్కువ ధరకు రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ధారించిన క్వింటా మొక్కజొన్న ధర 2400 కాగా కాంటాదారులు మాత్రం రైతుల వద్ద మేలు రకమైన మొక్కజొన్నను కూడా 1800, 1600 మాత్రమే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే యూరియా సకాలంలో అందక పంట దిగుబడి పైన తీవ్ర ప్రభావం చూపిన క్రమంలో కాంటాదారుల మోసాల కారణంగా ఒక్కో క్వింటాకి సుమారు 600 నుంచి 1000 వరకు రైతు నష్టపోతున్నాడు.
ఓవైపు వాతావరణ శాఖ వర్ష సూచన ఉందని చెప్తుండడంతో చేతికి వచ్చిన పంట వర్షార్పణం అయ్యే ప్రమాదం ఉందని మరో వైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో దళారులకే ధా న్యాన్ని అప్పచెప్పాల్సిన పరిస్థితి దాపురించిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు మార్కెట్ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ముందు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే గన్ని బ్యాగులు పంపిణీ చేస్తున్నడంతో కౌలు రైతులకు తిప్పలు తప్పడం లేదు.
యజమాని నుండి ఏ ఈ ఓ సహకారంతో ఓటీపీ ద్వారా ఓచర్ రాయించుకున్న తర్వాతే మార్కెట్ అధికారులు టోకెన్ ద్వారా గన్ని బ్యాగుల పంపిణీ నిబంధన తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని కవులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, తెలకపల్లి ప్రాంతాల్లో మార్క్ఫెడ్ ద్వారా ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కానీ నాగర్ కర్నూల్ లో 12,000 క్వింటాళ్లు, అచ్చంపేటలో 2వేల క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యాన్ని మాత్రమే ఇప్పటివరకు సేకరించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. కొల్లాపూర్, తెలకపల్లి కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేకపోయారు.
వ్యవసాయ మార్కెట్లో దళారుల దందా..!
అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించకపోవడంతో ఇప్పటికే కోత దశకొచ్చిన మొక్కజొన్న పంటను దళారులకే అప్ప చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు వర్ష సూచన మరోవైపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇదే అదునుగా భావిస్తున్న కాంటాదారులు తేమ తరుగు పేరు చెప్పి అతి తక్కువ ధర నిర్ణయిస్తూ తమను నట్టేట ముంచుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
రైతుల వద్ద కొనుగోలు చేస్తున్న దళారులు తూకాల్లోనూ భారీగా మోసాలకు పాల్పడుతున్నారని ఫలితంగా రైతులు క్వింటాల్కి మూడు కిలోల చొప్పున మోస పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన దళారులు రైతాంగానికి డబ్బులు ఇవ్వడంలోనూ రోజుల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆయా గ్రామాల రైతులు మండి పడుతున్నారు. అయినా సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారులకు కొమ్ముకాస్తున్న పాలకవర్గాలు.!
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ మార్కెట్ కమిటీ పాలకవర్గాలు కూడా దళారులకు కొమ్ముకాస్తూ మోసాల్లో వాటాలు పంచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు భారీ మొత్తంలో వ్యాపారులు దళారులు నజరానా ప్రకటిస్తున్నట్లు ఫలితంగా మార్కెట్ కు వచ్చిన రైతాంగానికి కనీస వసతులు కూడా కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రైతాంగ సమస్యలపై పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అనంతరం మొక్కజొన్న పండించిన రైతుల వేలిముద్రల ఆధారంగా గన్ని బ్యాగులు సరఫరా చేస్తున్నాం పంట కోత అనంతరం ఎండబెట్టుకొని మార్కెట్కు తీసుకురావడం మంచిది. ఇప్పుడిప్పుడే పంట కోతలు ప్రారంభం అయ్యాయి. కల్వకుర్తి ప్రాంతాల్లో మొక్కజొన్న ఇంకా పొట్ట దశలోనే ఉన్నాయి. మొక్కజొన్న కౌలు రైతులు కూడా ఆందోళన చెండాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కొంటాం.




