మోసం.. ఘనం..
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మోసాలు..
- రైతులను ముంచుతున్న అధికారులు..
- అడిగేది ఎవరని ఇష్టారాజ్యంగా కొనుగోలు..
తాడ్వాయి, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని తామే కొంటాం, రైతులకు గిట్టుబాటు ధరలు అందించి ఆదుకుంటాం, రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులు ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసే కొన్ని కేంద్రాలలో అసలు కథ వేరేలా ఉంది.
రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కొందరు అధికారులు తమ ఇష్టారాజ్యంగా తూకం వేసి రైతులను దోపిడీ చేస్తున్నారు. ఒక బస్తాలో 50 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 51.300 గ్రాములు తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో బస్తాకు ఒక కిలో 300 గ్రాముల బరువును ఎక్కువగా తూకం చేస్తున్నారు. ఒక బస్తా 600 గ్రాముల బరువు ఉంటుంది. కానీ అధికారులు 800 గ్రాముల ధాన్యాన్ని అదనంగా తూకం వేసి తీసుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో అధికారుల తీరు విభిన్నంగా ఉంది. మమ్మల్ని అడిగేవారు ఎవరన్నా ధీమాతో ఇష్టారాజ్యంగా రైతుల నుంచి ధాన్యాన్ని తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ బరువు తూకం చేస్తున్నారని రైతులు ప్రశ్నించగా మీ ధాన్యానికి తరుగు పోతుందని సులభంగా బదులు చెబుతున్నారు. ఒక బస్తా బరువు 600 గ్రాముల ఉంటుంది కదా ఎందుకు ఎక్కువ తూకం వేస్తున్నారు అని ప్రశ్నించగా కాదు ఒక బస్తా కిలో బరువు ఉంటుందని అధికారులు రైతులకు సమాధానం చెబుతున్నారు.
ఒక కిలో బరువు పోను మరో 300 గ్రాములు ఎక్కువగా ధాన్యాన్ని తూకం వేసి తీసుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కొందరు అధికారులు ఇదే అదునుగా భావించి దోపిడీకి పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయిస్తే ఇక్కడ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు ఇలా..
- తాడువాయి మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాసుల సంగరాజు పండించిన 104 బస్తాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కలు కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. 104 బస్తాలకు 52 క్వింటాళ్ల ధాన్యం తూకం జరిగింది. ఒక్కో బస్తాకు 50 కిలోల చొప్పున ధాన్యం తూకం వేశారు. కానీ అధికారులు 50 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 51.300 గ్రాముల తూకాన్ని వేసి తీసుకున్నారు. ఇంత ఎక్కువ తూకం వేసి తీసుకున్న ఇది సరిపోదు అన్నట్లుగా మరో రెండున్నర క్వింటాళ్ల ధాన్యం డబ్బులు కట్ చేసి సంగరాజు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు.
ఆయన విక్రయించిన 52 క్వింటాళ్ల ధాన్యానికి ఒక్కో క్వింటాల్ కు ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం రూ.2400 ఖరారుతో విక్రయించాడు. 52 క్వింటాలకు కాను రూ.124800 రావాల్సి ఉండగా, అధికారులు రెండున్నర క్వింటాళ్ల ధాన్యాన్ని తరుగులో మినహాయించుకుని రూ 1,18,800 ఖాతాలో జమ చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంగరాజు బోరుమని విలపించారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నించగా ఈ విషయం తమకు తెలియదని పై అధికారులకు తెలియజేస్తామని దాటవేస్తున్నారని సంగరాజు విజయక్రాంతితో విలపిస్తూ చెప్పారు.
చిట్యాల గ్రామంలో మరికొంతమంది బాధితులు..
- - జక్కుల రాజేశ్వర్ రెడ్డి ఒక క్వింటాలు ధాన్యము, మూగ రాజు ఒక క్వింటాలు ధాన్యము, మూగ శారద ఒక క్వింటాలు,సప్పేటి రాజిరెడ్డి ఒక క్వింటాలు, బాలయ్య అర క్వింటాలు ధాన్యం తరుగు పేరుతో డబ్బులు కట్ చేశారు.వీరే కాకుండా గ్రామంలో మరో 15 మంది రైతుల ధాన్యాన్ని తరగు గా అధికారులు కట్ చేసి బ్యాంకులో డబ్బులు జమ చేశారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క చిట్యాల గ్రామంలో కాకుండా మండలంలో, జిల్లా లో సైతం చాలా గ్రామాల్లో రైతుల మక్కల బస్తాలకు అధిక తూకం వేసి కొనుగోలు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఇక్కడ కూడా మోసమే జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధికారులు తరుగు పేరుతో కట్ చేసిన ధాన్యం డబ్బులు తిరిగి జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
2.50 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు కట్ చేశారు..
తాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మక్కలు కొనుగోలు కేంద్రంలో మొత్తం 104 బస్తాల ధాన్యాన్ని విక్రయించాను. ఒక్కో బస్తాకు 50 కిలోల చొప్పున 52 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ 1,24800 రావాల్సి ఉంది. కానీ అధికారులు రూ.118,800 మాత్రమే బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రూ. 6000 తక్కువగా జమ చేశారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నీ ధాన్యం తరుగుపోయిందని తెలుపుతున్నారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్ చేసిన ధాన్యం డబ్బులు వెంటనే బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.
మాసుల సంగరాజు, రైతు చిట్యాల




