11 May, 2026 | 2:10 AM

పోలీస్ శాఖలో బది‘లీలలు’!

11-05-2026 12:46 AM
  1. ‘పంచే’వారికి పెద్దపీట వేసిన అధికారులు!
  2. డిప్యూటేషన్ ల పేరిట ఏళ్లుగా తిష్ట
  3. అక్రమార్కుల జాబితా ఇచ్చినా చర్యలు శూన్యం
  4. అధికారుల అండతో మళ్లీ అక్కడే విధులు
  5. నిరుత్సాహంలో నిఘా విభాగం అధికారులు?

నల్లగొండ నిఘా విభాగం, మే 10 : జిల్లాలోని పోలీస్ శాఖలో ఇటీవల సాధారణ బది‘లీలలు’ జరిగినట్టు ఆ శాఖలోనే చర్చించుకుంటున్నారు. మంచిగా ‘పంచే’స్తారని కొందరిని బదిలీ కాకుండా డివిజన్ స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు మాటలు చెప్పి వారికి బదిలీ జరగకుండా చేయడం ఆ శాఖలోని హాట్ టాపిక్ గా మారినట్లు వినికిడి. 

ఏండ్ల తరబడి ఒకేచోట తిష్ట

ఇప్పటికే డిప్యూటేషన్ పేరిట కొందరు 15 ఏళ్లకు పైబడి ఒకే స్టేషన్ లో, ఒకే సర్కిల్, ఒకే డివిజన్ పరిధిలో ఒంటి మీద ఖాకి డ్రెస్ వేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. మళ్లీ వారినే డిప్యూటేషన్ పేరిట కొనసాగించడంతో ఆర్థిక బంధాలు బలంగా ఉన్నాయని అందుకే వారిని అధికారులు వెనుకేసుకొస్తున్నారనే వార్తలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నవారితో మంచి ప్రయోజనం ఉంటుందని పై అధికారులకు మంచి మాటలు చెప్పి బదిలీలు జరగకుండా, సర్కిల్ స్థాయి దాటి వెళ్లకుండా సర్కిల్ స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు దిద్దుబాటు చర్యలు చేసుకున్నట్లు ఆ శాఖలోనే అనుకుంటున్నట్లు తెలిసింది.

పోలీస్ స్టేషన్ లో రైటర్ లు, కోర్టు విధులు నిర్వహించే వారు, ఐడి పార్టీలో పని చేసేవారు డివిజన్ దాటి వెళ్లకుండా విధులు నిర్వహిస్తున్నారని అయినప్పటికీ సాధారణ బదిలీలో మళ్లీ వారికి పెద్దపీట వేయడంతో వారికి, అధికారులకు మధ్య ఉన్న ఆర్థిక బంధం ఎంత బలమైనదనేది అనే చర్చ బలంగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ వారిని ఆ శాఖలోనే కొనసాగించడంలో బలమైన ఆర్థిక కారణాలే ఉంటాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.                                                           

బదిలీలు ఇలా.. 

సాధారణ బదిలీలో ఒక పోలీస్ స్టేషన్ లో కాని స్టేబుల్ హోదాలో 5 ఏండ్లు, హెడ్ కానిస్టేబుల్ 4 ఏండ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ 3 ఏండ్లు పని చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సారి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా బదిలీలలో డివిజన్ స్థాయి అధికారులు, పై స్థాయి అధికారుల వద్ద చెప్పి అక్రమార్కులను వెనుకేసుకోచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని సీనియర్ అధికారులు చెవులు కోరుకొంటున్నట్లు వినికిడి.

అధికారుల తీరుపై అనుమానాలెన్నో..? 

ఒక స్టేషన్ నందు 5 సంవత్సరములు నిండిన వారిని వేరే పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయాల్సి ఉంటుంది కానీ మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కొనసాగించడంతో ఉన్నతాధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం లోని ఓ స్టేషన్ లో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయలేదని తెలిసింది.15 ఏళ్లుగా ఒకటే దగ్గర పనిచేయడం వలన దూర, మండల ప్రాంతాలలో ఏండ్ల తరబడి పని చేసే వారికి పట్టణంలో పని చేసే అవకాశం కలగడం లేదనీ ఎంతోమంది మదనపడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా మధనపడే వారు పై అధికారుల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తమ సన్నిహితుల వద్ద తన మనసులోని మాటను వెలిబుచ్చినట్లు తెలిసింది.  ఇదిలా ఉండగా ఈ సారి జరిగిన బదిలీల తీరును ఆసక్తికరంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

పేరుకే బదిలీలు.. అక్కడే విధులు..

ఒక పోలీస్ స్టేషన్ లో ఆర్డర్ ఉండి..ఇంకో పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న వారి లిస్ట్ తీసి రాత్రికి రాత్రి వారి సొంత పోలీస్ స్టేషన్ లకి వెళ్లాలని జిల్లా పోలీసు అధికారి ఆదేశాలు ఇచ్చాడు. దీనితో పోలీస్ శాఖలో కొన్ని ఏళ్ళనుండి ఒకే దగ్గర పాతుకోని పోయిన వారిలో ఆందోళన నెలకొన్నది. మంచి జరుగుతుందని మార్పు వస్తుందని సంతోషపడ్డా.. బదిలీల తర్వాత మళ్లీ ఎక్కువమందికి అదే పోలీస్ స్టేషన్లో కొనసాగే విధంగా అవకాశం కల్పించడంతో ఇవేం బదిలీలు గతంలో ఎన్నడు లేని విధంగా భిన్నంగా ఉన్నాయంటూ చర్చించుకుంటున్నారు.

నిజాయతీగా డ్యూటీ లు చేసే వారు, వయసు మీరిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేయవలసిన వారు బదిలీల తీరుతో వాపోతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో బదిలీలతో మార్పు వస్తుంది అనుకుంటే మళ్ళీ అవినీతిపరుల మార్క్ కనిపిస్తుందనే చర్చలు వినిపిస్తున్నాయి. అక్రమాలు చేసే వారికి ఉత్తమ స్థానం దక్కిందని నిజాయతీకి రోజులు లేవు, పై అధికారుల అండ, రాజకీయ బలం లేని వారి పరిస్థితి ఏమిటి అని అంతర్మధనం చెందుతున్నట్టు తెలుస్తుంది.

నిరుత్సాహంలో నిఘా అధికారులు ? 

నిఘా విభాగం వారు, పోలీస్ స్టేషన్ లలో అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న వారి జాబితా రైటర్, కోర్ట్ డ్యూటీ, క్రైమ్ డ్యూటీ చేసే వారి వివరాలు జిల్లా పోలీసు ఉన్నత అధికారికి ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిఘా అధికారులు సైతం నిరత్సాహంలో ఉన్నట్టు తెలుస్తుంది. స్టేషన్, సర్కిల్, డివిజన్ స్థాయి అధికారులే ఏండ్ల కు ఏండ్లు తిష్ట వేసినప్పుడు తాము ఓకే స్టేషన్లో ఉంటే తప్పు ఏమిటని కొందరు కింది స్థాయి ఉద్యోగులు మాట్లాడుకుంటుడడం గమనార్హం.

మంత్రి సహకారం ఉన్న ఓ డివిజన్ స్థాయి అధికారి అక్రమార్కులను అదే పోలీస్ స్టేషన్లో కొనసాగే విధంగా కీలకపాత్ర పోషించినట్లు స్థానికంగా పెద్ద చర్చే జరుగుతున్నట్లు సమాచారం. డివిజన్ స్థాయి అధికారీ వ్యవహరించే తీరుతో మంత్రికి చెడ్డ పేరు వస్తుందని పోలీస్ శాఖలో చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తీరు మార్చుకొని బదిలీలను పారదర్శకంగా నిర్వహించి  ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలని పలువురు పోలీసులు తమ సన్నిహితుల వద్ద తమ మనోగతంలో బయటపెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.