29 June, 2026 | 2:47 AM

బీజేపీ ‘నితిన్’ పర్యటన ఫ్లాప్ షో

29-06-2026 01:49 AM

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ చర్యలేవి?

బెంగాల్ విభజన రాజకీయాలు తెలంగాణలో సహించబోం

పేర్ల మార్పులో ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదు

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఫ్లాప్ షోగా మారిందని, తెలంగాణ బీజేపీ నాయకులు ఒక చిన్న సమావేశాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వీరు సాధించేదేం లేదన్నారు.

బూత్‌గెలుస్తాం, కార్పొరేషన్‌లో గెలు స్తాం అని ప్రగల్భాలు పలికే ముందు నిజనిజాలను తెలుసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరించారని అన్నారు. ఆదివారం నితిన్ నబీన్‌పై మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో విమర్శలు సంధించారు. జీహెచ్‌ఎంసీ గురించి మాట్లాడే ముందు, హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డంకులను తొలగించి మాట్లాడాలన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. రూ.లక్ష కోట్ల కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎందుకు చర్యలు చేపట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ గడ్డపై బెంగాల్ తరహా విభజన రాజకీయాలను సహించబోమన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందన్నారు. బీజేపీకి నగరాల పేర్లు మార్చడంలో ఉన్న శ్రద్ధ ప్రజల జీవితాలను మార్చడంలో ఎందుకు లేదన్నారు.