నల్లగొండ హస్తంలో వర్గపోరు!
- పంతం నెగ్గించుకున్న పున్న
- బహిరంగ సభలో మెరిసిన కైలాష్ నేత
- సీఎం రేవంత్ నోట డీసీసీ అధ్యక్షుడి ప్రస్తావన
- మరోవైపు గుమ్ముల, బుర్రికి ఊహించని షాక్
- వేదికపైకి వెళ్లకుండా అడ్డుకున్న సీఎంఓ సిబ్బంది
నల్లగొండ టౌన్, జూన్ 28 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివా రం నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలు మరోసారి బట్ట బయలయ్యాయి. పార్జీ జిల్లా అధ్యక్షుడు కైలాష్ నేతకు ఈ పర్యటనలో అడుగడుగు నా చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
మం త్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గానికి, కైలాష్ నేతకు మధ్య ఉన్న తీవ్రమైన గ్యాప్ కారణంగా.. ఫ్లెక్సీలు, పత్రికా ప్రకటనల్లో డీసీసీ అధ్యక్షుడి ఫొటోగానీ, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫొటోలుగానీ ఎక్కడా కనిపించకపో వడం తీవ్ర కలకలం రేపింది. ఒక దశలో కైలాష్ నేత సభకు రాకుండా పోలీసులు హౌ స్ అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన పంతం నెగ్గించు కున్న తరహాలో నేరుగా సీఎం సభా వేదికపై ప్రత్యక్షం కావడం విశేషం.
బహిరంగ సభా వేదికపైకి రావడం ఒకెత్తయితే.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రసంగంలో పున్న కైలాష్ నేత పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. తనను తొక్కేయాలని చూసిన స్థానిక తన వ్యతిరేక వర్గానికి కైలాష్ నేత ఈ రకంగా చెక్ పెట్టారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అత్యంత సన్నిహితులు, జిల్లా కేంద్రంలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు నాయకులకు సీఎం భద్రతా సిబ్బంది నుంచి ఊహించని షాక్ తగిలింది.
నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గు మ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రొటోకాల్, భద్రతా కారణాల దృష్ట్యా సీఎంఓ సిబ్బంది వారిని కఠినంగా అడ్డుకుని, పక్కకు నెట్టివేయడం సంచలనంగా మారింది. ఈ పర్యటన లో ముందే ఊహించిన అంశం.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు.
జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, మిగతా ఎమ్మెల్యేలందరూ సీఎం సభలో సందడి చేయగా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్క కపోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారానికి, ఈ సభకు ఆయన దూరం కావడం మరింత బలాన్ని చేకూర్చింది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ రేంజ్‌లో సీట్లు సాధించినప్పటికీ.. అంతర్గతంగా నేతల మధ్య ఉన్న అహాలు, ఆధిపత్య పోరు ఈ సీఎం సభ ద్వారా మరోసారి బహిర్గతమయ్యాయి.






