మావోయిస్టు పార్టీ అగ్రనేత నరహరి లొంగుబాటు
- సహచరితో కలిసి పోలీసుల ఎదుటకు
- ఆయన తలపై రూ.20 లక్షల రివార్డు
హైదరాబాద్, మే 12: మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ మంగళవారం తన సహచరితో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొం గిపోయాడు. నరహరి సహచరి ఏపీకి చెందినవారు. ఆమె కూడా పార్టీలోనే కీలక బాధ్యతలను నిర్వర్తించారు. నరహరి స్వస్థలం ఇప్పటి హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి. నర్స మ్మ సోమనారాయణల ఐదుగురు సం తానంలో నరహరి రెండో కుమారుడు.
1980లో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. గ్రామంలోని భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం కారణంగా మావోయిస్టు ఉద్యమం వైపు అడుగు వేశాడు. 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్న నరహరి పలు కీలక ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో సాంకేతిక విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
పేలుడు పదార్థాల తయారీలో దిట్ట. అగ్రనేతలు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, మిసర్ బెస్ర కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సాయుధ బలగాల ఒత్తిడి పెరగడం, వయస్సు పైబడటం, అనారోగ్య సమస్యల కారణంగా నరహరి దంపతులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. నరహరిపై రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. దశాబ్దాలపాటు గెరిల్లా పోరాటంలో కీలక పాత్ర పోషించిన నరహరి లొంగిపోవటం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగానే పరిగణిస్తున్నారు.






