రెసిడెన్షియల్ టీచర్ల జీతాలు పెంచాలి
- నెలకు 36 వేలు చెల్లించాలి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్ల జీతాలను ఇతర గురుకులాల మాదిరిగా నెలకు రూ.36 వేలకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన రాష్ట్ర పార్ట్‌టైం, కాంట్రాక్ట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా కేవలం రూ.18 వేల జీతంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 24 గంటలు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని కోరారు. మైనార్టీ గురుకులాల్లో రూ.36 వేలు, బీసీ గురుకులాల్లో రూ.27 వేల వరకు వేతనం చెల్లిస్తున్న నేపథ్యంలో సాంఘిక, గిరిజన గురుకుల టీచర్లకు కూడా రూ.36 వేల వేతనం, మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటిఎస్) వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, అరవింద్ రాజేందర్, నిఖిల్ పటేల్, భీమరాజు, శివకుమార్ యాదవ్, అంజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






