17 August, 2026 | 2:11 AM

కల్యాణలక్ష్మి రద్దుకు కుట్ర!

17-08-2026 01:30 AM
  1. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతున్నరు
  2. కౌంటర్ ఎందుకు వేయలేదు
  3. ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్న
  4. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించా రు. హైకోర్టు తీర్పును సాకుగా చూపు తూ పేదింటి ఆడబిడ్డల ఆర్థిక భరోసాను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో ఎండగట్టి, ఆడబిడ్డల పక్షాల పోరాడాలని కోరారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం సక్షేమ పథకాలు మాత్రమే కావని, పేదింటి ఆడబిడ్డల భవిష్యత్తు, ఆత్మగౌరవంతో ముడిపడిన కార్యక్రమాలని పేర్కొన్నారు.

పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లికి ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను  గుర్తించిన కేసీఆర్.. 2014 అక్టోబర్ 2న ఈ పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.51 వేల ఆర్థిక సహాయంతో పథకాలను ప్రారంభించి,  దశలవారీగా రూ.75,11,  రూ.1,00,116కు పెంచారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందన్నారు.

కోవిడ్  సంక్షోభ సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మిద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. అయితే ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయాల్సింది పోయి దానినే రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు.

కల్యాణలక్ష్మి కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఆడబిడ్డ ఇప్పుడు ఎన్నికల హామీ ప్రకారం తులం బంగారం కూడా డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఆడబిడ్డల పథకంపై ఎందుకింత నిర్లక్ష్యం?

పెళ్లిళ్లు జరిగి నెలలు, ఏళ్లు గడిచినా, కొందరికి పిల్లలు పుట్టినా కల్యాణలక్ష్మిసహాయం కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మిఅంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైనా కేటీఆర్ మండిపడ్డారు.

నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందని నిలదీశారు. ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి వంటి హైడ్రా వంటి అంశాల్లో ప్రైవేటు న్యాయవాదులకు భారీ మొత్తాలు చెల్లించి వాదించే ప్రభుత్వం, ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన పథకాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రశ్నించారు.

హైకోర్టు తీర్పును ఇప్పుడు సాకుగా చూపుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ హయాంలో అమలైన పలు సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన కాంగ్రెస్.. ఇప్పుడు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను కూడా రద్దు చేయాలని చూస్తోందని విమర్శించారు. ఆడబిడ్డ భారం కాదు.. భరోసా అనే భావనకు కేసీఆర్ ప్రభుత్వం రూపమిచ్చిందన్నారు.

అలాంటి పథకాలను రద్దు చేస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి తులం బంగారం వంటి హామీలతో ఓట్లు పొందిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని మరిచిపోయిందని మండిపడ్డారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసనల్లో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పేదింటి ఆడబిడ్డల పక్షాన తమ గళాన్ని వినిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.