17 August, 2026 | 3:05 AM

ఫిరాయింపు ఎమ్మెల్యేల 'గులాబీ' స్వరం!

17-08-2026 01:41 AM

కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి

  1. ఒక్కొక్కరుగా రివర్స్ గేర్? 
  2. మహిపాల్‌రెడ్డి, దానం నాగేందర్, తాజాగా పోచారం 
  3. నియోజకవర్గాల్లో నిధుల కొరత
  4. ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసహనం 
  5. అధికార పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు 
  6. బీఆర్‌ఎస్‌కు అస్త్రంగా తాజా పరిణామాలు

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేల స్వరంలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తిని బహిరం గంగానే వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు గులాబీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తు న్నాయి. నియోజకవర్గాలకు నిధుల కొర త, మంత్రుల సహకారం కూడా లేదం టూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే గూడెం మహిపాల్ రెడ్డి, దానం నాగేందర్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వెళ్లగక్కగా.. తాజాగా  సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా స్వరం మార్చడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. తాజా పరిణామాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజకీయంగా రివర్స్ గేర్ వేస్తున్నారా? అన్న చర్చ తెలంగాణలో మొదలైంది.

ఒక్కొక్కరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారుతుండగా.. గత బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వారే ప్రస్తావించడం గులాబీ పార్టీకి మాత్రం రాజకీయంగా కలిసి వస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో నెలకొన్న అసంతృప్తి.. బీఆర్‌ఎస్‌కు అస్త్రంగా మారుతోంది.   నిధుల కొరతతో ఎమ్మెల్యేల గుర్రు

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై ప్రధాన హామీ తీసుకున్నారు.  అదే అంశాలపై ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చకు దారితీస్తోంది. గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ ఎస్ నేతలతో సన్నిహితంగా కనిపించడం, బీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, దానం నాగేందర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అందడం లేదని వ్యాఖ్యానించారు.

తాజాగా పోచారం శ్రీనివాస రెడ్డి కూడా నిధుల విడుదల, మంత్రులతో సమన్వయం విషయంలో బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామాలు ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోందన్న చర్చకు బలం చేకూర్చుతున్నాయి. రాజకీయ విశ్లేషణలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

అయితే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సమకూరకపోవడం నిజంగానే ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ వైఖరిలో మార్పుకు కారణమైతే.. రాబోయే రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేల నుంచి ఇదే తరహా అసంతృప్తి స్వరాలు వినిపించే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ రాజకీయంగా ఎంతవరకు తనవైపు తిప్పుకోగలిగిందన్న ప్రశ్నతో పాటు.. రేపటి రాజకీయ పరిణామాల్లో వీరి అడుగులు ఎటువైపు ఉంటాయన్నది కూడా కీలకంగా మారుతోంది.

కాంగ్రెస్‌పై అసంతృప్తి.. బీఆర్‌ఎస్‌కు బలం

ఒక్కొక్కరుగా ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి  వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలు బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా అనుకూలంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రావడం లేదని, ప్రభుత్వ పెద్దల నుంచి ఆశించిన సహకారం అందడం లేదని బహిరంగంగా మాట్లాడటం గులాబీ పార్టీ వాదనలకు బలం చేకూరుస్తోంది.

దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి పరిణామాలను బీఆర్‌ఎస్ తన రాజకీయ ప్రచారానికి అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ఇప్పుడు నిధులు అందడం లేదు. ప్రభుత్వంపై వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ పార్టీకి అవకాశం లభిస్తోంది.

ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల వ్యవహారం న్యాయస్థానాల్లో కొనసాగుతుండగా, తాజాగా వారి రాజకీయ వైఖరిలో కనిపిస్తున్న మార్పులు ఈ అంశానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తడం బీఆర్‌ఎస్‌కు బలమైన రాజకీయ అస్త్రంగా మారుతోంది. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిన నేతల నోటే ఇప్పుడు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, అప్పటి ప్రభుత్వ సహకారం ప్రస్తావనకు రావడం గులాబీ పార్టీకి మైలేజీ ఇచ్చే అంశంగా మారింది.

దీంతో ఫిరాయింపులపై ఇంతకాలం బీఆర్‌ఎస్ చేసిన విమర్శలకు ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలే బలం చేకూరుస్తున్నాయా? అన్న చర్చ మొదలైంది. రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలు ఇదే తరహాలో స్పందిస్తే.. బీఆర్‌ఎస్‌కు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది.

భవిష్యత్తు పరిణామాలపై ఆసక్తి

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు, మారుతున్న వారి రాజకీయ వైఖరి భవిష్యత్తు పరిణామాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల వ్యవహారం కూడా ఇంకా కొనసాగుతోంది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ తిరస్కరించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాల్  చేస్తూ తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈనెల 14న కోర్టులో విచారణ జరగగా నేటికీ (సోమవారం) వాయిదా పడింది.

ఒకవైపు న్యాయపరమైన వివాదం.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి.. ఇంకో వైపు పాత పార్టీపట్ల అనుకూల వ్యాఖ్యలు  ఆసక్తిని పెంచుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల రాజకీయ స్వరంలో వస్తున్న మార్పు మాత్రం కాంగ్రెస్‌కు హెచ్చరికగానే, బీఆర్‌ఎస్‌కు మాత్రం రాజకీయంగా కలిసొచ్చే పరిణామంగానే కనిపిస్తోంది. గూడెం మహిపాల్‌రెడ్డి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వైఖరి నేపథ్యంలో వీరి తదుపరి రాజకీయ అడుగులపై సహజంగానే చర్చ మొదలైంది.

అయితే న్యాయపరమైన పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎమ్మెల్యేల సంబంధాలు, నియోజకవర్గాలకు నిధుల పరిస్థితి.. ఇవన్నీ రానున్న రోజుల్లో వారి రాజకీయ వైఖరిని ప్రభావితం చేసే అంశాలుగా మారే అవకాశం ఉంది. మరింత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో అసంతృప్తి వ్యక్తం చేస్తారా?, లేక కాంగ్రెస్ నాయకత్వం వారిని తిరిగి సమన్వయం చేసుకుంటుందా? అన్న అంశంపై రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.