17 August, 2026 | 3:05 AM

జోరుగా అక్రమ రిసార్టులు!

17-08-2026 12:53 AM

వీవీఆర్ బృందావన్ రిసార్ట్‌పై చర్యలు శూన్యం.. మండిపడుతున్న స్థానికులు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండల పరిధిలో అనుమతుల్లేని అక్రమ రిసార్టులు జోరుగా వెలుస్తున్నాయి. ఆట, పాట మాటున అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న రిసార్ట్ నిర్మాణాలను అడ్డుకోవడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్మాణ అనుమతుల నుంచి మొదలుపెడితే రిసార్ట్ నిర్వహణ వరకు ప్రతి దశలోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

జల్సాల పేరుతో విదేశీ మద్యం సరఫరా చేస్తూ, ఎలాంటి నిబంధనలు పాటించకుండా రాత్రి, పగలు తేడా లేకుండా దావత్లు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనల ఉల్లంఘన వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంటే, అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు వచ్చే ‘జీతం కన్నా గీతంపైనే‘ ప్రత్యేక శ్రద్ధ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 అనుమతుల్లేకుండానే భారీ నిర్మాణం...

ఉప్పరిగూడ గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 1057 పరిధిలో దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ‘వివిఆర్ బృందావన్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్‘ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. గ్రామంలో అంత భారీ ఎత్తున నిర్మాణం జరుగుతున్నా గ్రామ పంచాయతీ కార్యదర్శి కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ‘నేను కొత్తగా వచ్చాను‘ అంటూ సాకులు చెప్తూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 పేదోడికో న్యాయం.. పెద్దోడికో న్యాయమా?....

అధికారుల పక్షపాత వైఖరిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఒక పేదవాడు నివాసం కోసం చిన్న గూడు కట్టుకుంటే వంద రకాల కొర్రీలు పెట్టి వేధించే అధికారులు, ఎలాంటి అనుమతులు లేకుండా లక్షలు గడించేందుకు నిర్మిస్తున్న భారీ వ్యాపార సముదాయాలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. చేతివాటం అందాక అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని, లంచాలు ఇస్తే అక్రమాలను సక్రమంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాకు సమాచారం లేదు....

‘సదరు రిసార్ట్ నిర్మాణానికి సంబంధించి పంచాయతీ నుంచి గానీ, హెచ్ ఎమ్డీఏ నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేవు.

సంతోష, గ్రామ కార్యదర్శి,  ఉప్పరిగూడ