కులగణనపై మాట మార్చిన ప్రధాని
- కేంద్రం నమ్మించి బీసీలను మోసం చేసింది
- వచ్చేవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): జన గణనలో బీసీ కులగణన చేపడతామని ప్రధాని మోదీ ఎడాది క్రితం బీసీలకు హామీ ఇచ్చి, ఇప్పుడు కులగణన చేయకుండా బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పైర్ అయ్యారు. ఏప్రిల్ 2026వ 1 నుంచి మొదటి దశ జనగణనలో కుటుంబాల లెక్కింపు జరిగినప్పుడు ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలన్న బీసీల డిమాండ్‌ను కనీసం పరిగణలోకి తీసుకోలేదని, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతోపాటు ఓబీసీ కుటుంబాలను లెక్కించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో నిలదీసినప్పుడు రెండవ దఫా జరిగే జనగణనలో బీసీ కులగణన చేపడుతామని పార్లమెంట్‌లో హామీ ఇచ్చి, ఆగస్టు 14న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో 40 ప్రశ్నలు విడుదల చేసిందన్నారు. అందులో మీరు ఎస్సీల/ఎస్టీల ఏ కులం అడిగిందే తప్ప తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో మాదిరిగా మీరు ఓబీసీనా?
అందులో ఏ కులం అని అడగలేదన్నారు. బీసీ జాబితా ప్రకటించకుండా, ప్రతి కులానికి ఒక యూనిక్ నెంబర్ కేటాయించకుండా బీసీ కులాల లెక్కలు ఏ విధంగా తీస్తుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తామిచ్చిన గెజిట్ నోటిఫికేషన్ సవరించి తెలంగాణ,
బీహార్ రాష్ట్రలలో జరిగిన కులగనను మోడల్ గా తీసుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతర అగ్రకులాల జాబితాను విడుదల చేసి వాటి ఆధారంగా కులాలకు ఒక యూనిక్ కోడ్ కేటాయించి శాస్త్రీయంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా బీసీలుగా తాము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వచ్చేవారం ఢిల్లీలో అఖిలపరీక్ష పార్టీలు, ఓబీసీ సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.






