డెయిరీ X పొన్నం!
- కరీంనగర్ డెయిరీ భూములపై రాజకీయ వివాదం
- ధరణి పోర్టల్‌లో డెయిరీ భూములుగా డిక్లరేషన్
- భూ భారతిలో స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ పేరిట మార్పు
- భగ్గుమంటున్న పాడి రైతులు
- నేడు కరీంనగర్‌లో 5 వేల మంది రైతులతో భారీ ర్యాలీ
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కరీంనగర్ డెయిరీ, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో కరీంనగర్ డెయిరీ భూములు డెయిరీ పేరుతోనే ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాకా ఆ భూములు తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ పేరు పైకి మార్చడం పట్ల పాడి రైతులు భగ్గుమంటున్నారు.
పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే డెయిరీ భూములు, నిర్వహణపై డెయిరీ చైర్మన్‌పై విమర్శలు చేశారు. తాజాగా ప్రభుత్వం కరీంనగర్ డెయిరీ భూములను డెయిరీ ఫెడరేషన్ పేరిట మార్చడం పట్ల డెయిరీ చైర్మన్ డాక్టర్ చల్మెడ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్‌లోని రాంనగర్లోని డెయిరీ నుంచి కలెక్టరేట్ వరకు ఐదు వేల మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేయనున్నారు.
రాష్ట్రంలోనే అగ్రగామి
కరీంనగర్ డెయిరీ పాల సేకరణ, అమ్మకాలలో గణనీయమైన పురోగతి సాధిస్తూ, రాష్ట్రంలోనే అగ్రగామిగా కరీంనగర్ డెయిరీ నిలిచింది. రాష్ట్ర సాధన ఉద్యమం మొదటి దశ అనంతరం 1971 అక్టోబర్ 16న ఇది స్థాపించబడింది. ఆ కాలంలో కరీంనగర్ పట్టణంలో 12 వేల లీటర్ల సామర్థ్యం గల ఈ డెయిరీని ఏర్పాటు చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు, వ్యవసాయ శాఖ మంత్రి జే చొక్కారావు కీలక పాత్ర పోషించారు.
1997 వరకు, ఈ డెయిరీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసింది. 1964 నాటి ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం కింద కరీంనగర్, ఆదిలాబాద్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్‌గా నమోదు చేయబడింది. 1995లో ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల (ఏపీఎంఏసీఎస్) చట్టం ప్రవేశపెట్టిన తర్వాత, కరీంనగర్ డెయిరీ 2003 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం లిమిటెడ్‌గా నమోదు చేయబడింది.
తరువాత, 1956 కంపెనీల చట్టం ప్రకారం దీనిని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అలియాస్ కరీంనగర్ డెయిరీగా మార్చారు. అప్పటి నుంచి, వేములవాడ ఆలయ ప్రాంగణంలోని పురాతన , చారిత్రాత్మక శ్రీరాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే ’కోడె మొక్కు’ (ఎద్దును కట్టడం) ఆచారానికి ప్రతీకగా, ఇది తన లోగోను ‘నంది‘గా మార్చుకుంది.
గతంలోనూ రైతుల ఆందోళన
డెయిరీ సమస్యలపై గతంలోనే ఉద్యమించిన పాడి రైతులు.. తాజాగా డెయిరీ ఆస్తుల వివాదం నేపథ్యంలో మరో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న లీటర్ కు రూ.114 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాడిరైతుకు 50% సబ్సిడీపై 2 పాడి గేదెలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కరీంనగర్ డెయిరీకి షాక్
కరీంనగర్ డెయిరీకి రాంనగర్‌లో ఉన్న ఆస్తులు, షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్‌లను లక్ష పాడిరైతు కుటుంబాల సంస్థకు అప్పగించాలన్న కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ధరణిలో కరీంనగర్ డెయిరీ పేరు మీద ఉన్న భూమిని భూ భారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరుమీద మార్చారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో డెయిరీ తీరుపై ఆగ్రహించిన ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు మార్చారని పాడి రైతులు భావిస్తున్నారు.
ఈ మేరకు రైతులు ఆందోళనకు సిద్ధం అయ్యారు. ప్రభుత్వం వెంటనే కరీంనగర్ డెయిరీ పేరు మీద వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష పాడిరైతు కుటుంబాల సంస్థ, 2 లక్షల పాలను సేకరిస్తూ తెలంగాణకే తలమానికంగా నిలిచిన కరీంనగర్ డెయిరీ సంస్థ ఆందోళన బాట పట్టడం తో డెయిరీ రంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






