17 August, 2026 | 9:28 AM

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

17-08-2026 08:36 AM

నిత్యవసర సరుకులు, బట్టలు, ఫర్నిచర్ దగ్ధం 

గణపురం,ఆగస్టు17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రానికి చెందిన బానాల(కమ్మరి) రవి ఇల్లు ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులకు చెందిన నిత్యవసర సరుకులు, బట్టలు, ఫర్నిచర్ తో పాటు ఇతర విలువైన వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని ఫ్రిడ్జ్ వద్ద అకస్మాత్తుగా కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది. క్షణాల్లో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న బియ్యం, బీరువా, బట్టలు, ఫ్రిడ్జ్, ఇతర గృహోపకరణాలన్నీ కాలిపోయాయి. మంటల తీవ్రతకు కుటుంబ సభ్యులు బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదిక తయారు చేయాలని విజ్ఞప్తి చేశారు.