28 May, 2026 | 2:31 AM

నేడు బక్రీద్

28-05-2026 01:32 AM

హైదరాబాద్, మే 27(విజయక్రాంతి): పవిత్రమైన బక్రీద్‌ను ముస్లింలు గురువారం ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. అలాగే పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక వసతులు చేపట్టింది. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన దుల్-హిజ్జా 10వ రోజు వస్తుంది. ఆ ప్రకారం ముస్లిం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి.

అయితే ఈసారి దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో పండుగ తేదీ మారినట్టు మత పెద్దలు ప్రకటించారు. తొలుత ప్రకటించిన దాని ప్రకారం మే 27న బక్రీద్ జరుపుకోవాల్సి ఉండగా దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో  దానిని 28 గురువారం నాడు పండుగ జరుపుకోవాలని మత పెద్దలు ప్రకటించారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పండుగ సెలవును 28కి మార్చింది. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా విద్యాసంస్థలు, బ్యాంకులకు ఆ రోజున ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.  

త్యాగనిరతికి ప్రతీక: --సీఎం రేవంత్‌రెడ్డి

త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని సీఎం చెప్పారు. బక్రీద్ పండుగ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలను గుర్తుచేస్తుందన్నారు. 

దాన గుణానికి ప్రతీక బక్రీద్  మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

త్యాగానికి, దాన గుణానికి ప్రతీకగా విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బక్రీద్(ఈద్ పవిత్రమైన రోజు సందర్భంగా ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ధనవంతులు, పేదలు అనే తరతమ బేధాలు లేకుండా, ప్రజల నడుమ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని బక్రీద్ పండుగ పెంపొందిస్తుందని తెలిపారు.

ఈ పవిత్ర దినాన.. ధార్మికత, దైవ చింతన ప్రతి మానవుడి హృదయంలో విరజిమ్మాలని కేసీఆర్ ఆకాంక్షించారు. గంగా, జమున సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజల నడుమ సోదర భావం ఐక్యత పెంపొందాలని కోరుకున్నారు.