28 June, 2026 | 2:35 AM

పశ్చిమాసియాలోమళ్లీ వార్!

28-06-2026 01:28 AM
  1. ఇరాన్ స్థావరాలపై అమెరికా మెరుపుదాడులు
  2. డ్రోన్ నిల్వ కేంద్రాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యం
  3. గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపై ఐఆర్జీసీ గురి

టెహ్రాన్, జూన్ ౨౭: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం మొదలైంది. వారం క్రితమే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాలు జరిగినప్పటికీ, విషయం మళ్లీ సమస్య మొదటికి వచ్చింది. హోర్ముజ్ జలసంధి వద్ద సముద్ర జలాల్లో వెళ్తున్న సింగపూర్ కార్గో నౌకపై ఇరాన్ శుక్రవారం ఆంక్షల పేరుతో దాడులు చేయడమే, తమ దాడులకు కారణమని అమెరికా వాదిస్తున్నది. అక్కడితో ఆగకుండా ఇరాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నది.

దీనిలో భాగంగానే శనివారం ఇరాన్‌లోని క్షిపణి, డ్రోన్ల నిల్వ కేంద్రం, రాడార్ స్థావరాలపై దాడులకు దిగింది. దాడుల తర్వాత హోర్ముజ్ జలసంధి వద్ద హై అలర్ట్ నెలకొంది. మరోవైపు, చర్చల మధ్యలోనే తమపై దాడులకు తెగబడి, అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడుతున్నది. దాడులకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఐఆర్జీసీ సైతం గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

తెలివి తక్కువ పని: ట్రంప్

సింగపూర్ నౌకపై ఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఆంక్షల పేరుతో ఇరాన్ ఇతర దేశాల నౌకలపై దాడులకు పాల్పడటం తెలివి తక్కువ పని అంటూ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా మండిపడ్డారు. దాడులకు ప్రతిగా అమెరికా కూడా దాడులకు దిగుతుందని హెచ్చరించారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటలకే అమెరికన్ సైన్యం ఇరాన్‌ను టార్గెట్ చేయడం గమనార్హం.