25 July, 2026 | 2:04 AM

తుమ్మిడిహట్టి డీపీఆర్ రెడీ

25-07-2026 01:14 AM
  1. ప్రభుత్వానికి నాలుగైదు రోజుల్లో నివేదిక 
  2. సర్వేలు, సాంకేతిక పరీక్షలు పూర్తి 
  3.   152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదన 
  4. త్వరలో మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ బృందం భేటీ 
  5. గోదావరి జలాల వినియోగంలో కీలక మలుపు

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంది. ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం కావడంతో, తెలంగాణ ప్రభుత్వం గోదావరి జలాల వినియోగంపై మరో ముందడుగు వేయబోతోంది. మరో నాలుగైదు రోజుల్లో ఈ డీపీఆర్ ప్రభుత్వానికి అందనున్నట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వం దానిని పరిశీలించి మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించనుంది.

టోపోగ్రాఫికల్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు, హైడ్రాలజీ విశ్లేషణలు, నదీ ప్రవాహ అధ్యయనాలు, భూభాగ పరిస్థితులు, ముంపు అంచనాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. తుమ్మిడిహెట్టి బరాజ్‌ను 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) వద్ద నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు.

బరాజ్ ఎత్తుపైనే నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి నుంచి తెలంగాణకు వినియోగించుకునే నీటి పరిమాణం, భవిష్యత్ సాగునీరు, తాగునీటి అవసరాలు, నీటి మళ్లింపు సామర్థ్యం వంటి కీలక అంశాలు ఆధారపడి ఉంటాయి. ఎఫ్‌ఆర్‌ఎల్ 152 మీటర్లుగా ఉంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండటంతో ఉత్తర తెలంగాణ జిల్లాల అవసరాలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో బరాజ్ ఎత్తు పెరగడం వల్ల మహారాష్ట్ర పరిధిలో ముంపు ప్రభావం ఎంత మేర ఉంటుందనే అంశం అత్యంత కీలకంగా మారనుంది. అందుకే డీపీఆర్ సిద్ధమైనప్పటికీ, ప్రాజెక్టు అమలులో తదుపరి అడుగు పూర్తిగా రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తేనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పర్యావరణ, అటవీ శాఖల అనుమతుల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. 

మహారాష్ట్రతో చర్చలే అసలు పరీక్ష

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం కావడం కీలక ముందడుగు అయినప్పటికీ, ప్రాజెక్టు అమలులో అసలు పరీక్ష మాత్రం మహారాష్ట్రతో జరిగే చర్చలే కానున్నాయి. గోదావరి అంతర్రాష్ట్ర నది కావడంతో బరాజ్ ఎత్తు, ముంపు ప్రభావం, నీటి వినియోగం వంటి అంశాలపై మహారాష్ట్ర అంగీకారం అత్యంత కీలకం. ముందుగా డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం త్వరలో మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో బరాజ్ ఎత్తు, ముంపు గ్రామాల పరిస్థితి, నీటి నిల్వ సామర్థ్యం, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, అవసరమైతే సాంకేతిక మార్పులు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన తర్వాత డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలనకు పంపనున్నారు.

సీడబ్ల్యూసీ సాంకేతిక ఆమోదం అనంతరం పర్యావరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులు, అవసరమైతే ఇతర కేంద్ర సంస్థల క్లియరెన్సులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తున తర్వాతే ప్రాజెక్టు వ్యయ అంచనాలకు తుది ఆమోదం, నిధుల సమీకరణ, టెండర్ల పిలుపు, నిర్మాణ సంస్థల ఎంపిక వంటి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

అయితే చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే ప్రాజెక్టు అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ, భూసేకరణ, అవసరమైతే నిర్వాసితుల పునరావాసం, నిర్మాణ సంస్థల ఎంపిక, పనుల కాలపట్టిక వంటి అంశాలు కూడా ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. 

తెలంగాణకు కీలక ప్రాజెక్టు

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు తెలంగాణకు కేవలం మరో సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, గోదావరి జలాల వినియోగంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్నారు. రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం, భవిష్యత్‌లో నీటి అవసరాలను తీర్చుకోవడం, ఉత్తర తెలంగాణలో సాగునీటి విస్తీర్ణాన్ని పెంచడం వంటి లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.