భావప్రకటన స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే..
బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, జూలై 24 (విజయక్రాంతి): రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కాపాడే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ వీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాకు ఆయన హాజరయ్యారు.దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న యువతపై అణచివేత, దమనకాంగ సాగిస్తోందన్నారు.
ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. యువత గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలని చూస్తే గులాబీ దండు చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తమ అధిష్టానం దిశానిర్దేశంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్దుకోని భావి భారత పౌరుల భవిష్యత్తుకు భరోసానివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు గోవర్ధన్ రెడ్డి వెంట వెళ్లి పాల్గొన్నారు.






