ముగ్గురు భారతీయ నావికులు మృతి
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) ధ్రువీకరణ
ఒమన్ తీరంలోని నౌకలపై ఇరాన్ దాడులే కారణమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి ౩: పశ్చిమాసియా యుద్ధం ముగ్గురు భారతీయ నావికులను బలితీసుకుంది. మరో ఇండియన్ నావికుడు క్షతగాత్రువడానికి కారణమైంది. ఒమన్ తీరంలోని నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతోనే వీరి మరణం సంభవించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) మంగళవారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చింది. మరోవైపు, భారతీయ నావికులకు సైతం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
నౌకలకు క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పు ఉన్నందున నావికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నౌకాయాన సంస్థలు కూడా ప్రతి ప్రయాణానికి ముందు ప్రమాద తీవ్రతను అంచనా వేయాలని సూచించింది. సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, ఆ సమస్యను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.




